మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 25 : బిల్లుకడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామంటూ ఓ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం డిమాండ్ చేసిన ఘటన మంచిర్యాలలో బుధవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన కొంగ శ్రీనివాస్(45)కు మంగళవారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. రోగిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, వెంటనే వైద్యం అందించాలని, ఇందుకోసం రూ.1.80 లక్షలు అవుతుందని కుటుంబ సభ్యులతో ప్యాకేజీ మాట్లాడుకున్నారు. ఆ వెంటనే రూ.1.50 లక్షలు కట్టించుకున్నారు. చికిత్స ప్రారంభించిన 45 నిమిషాల తర్వాత శ్రీనివాస్ మృతి చెందాడని కుటుంబ సభ్యులకు తెలిపారు.
బుధవారం ఉదయం శ్రీనివాస్ కుటుంబ సభ్యులను కలిసి బిల్లు రూ.4.50 లక్షలు అయ్యిందని, మిగతా రూ. 3 లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. దీంతో షాక్‌కు గురైన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించేది లేదని, ప్యాకేజీ రూ.1.80 లక్షలు అని చెప్పి.. ఇప్పుడేమో రూ.4.50 లక్షల బిల్లు ఎలా వేశారని, అంటే చనిపోయిన వ్యక్తికి వైద్యం చేశారా.. అంటూ ఆందోళనకు దిగారు. హాస్పిటల్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయం మీడియాకు తెలియడం.. పలు ఛానళ్లలో వార్తలు రావడం, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అప్రమత్తమైన యాజమాన్యం బాధిత కుటుంబ సభ్యులతో చర్చించి సెటిల్మెంట్ చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని అప్పగించడంతో కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.