కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలిచే ప్రాథమిక సహకార సంఘాలను బలోపేతం చేసే దిశగా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 12 పీఏసీఎస్‌లను పునర్వ్యవస్థీకరణ చేసి అదనంగా మరో 18 సంఘాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం పనిచేస్తున్న సహకార సంఘాల గడువు వచ్చేనెల 2వ తేదీతో ముగియనుండగా, ఆలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టింది.
మండలానికి రెండు చొప్పున..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు పాత మండలాల ప్రకారం ప్రతి మండలానికి ఒక సహకార సంఘం చొప్పున 12 సహకార సంఘాలు ప్రస్తుతం జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుతం సహకార సంఘాలున్న ప్రతి మండలంలో అదనంగా ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఇక కొత్తగా ఏర్పడిన లింగాపూర్, చింతలమానేపల్లి, పెంచికల్పేట్ మండలాల్లో సహకార సంఘాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఈ మండలాల్లో రెండు చొప్పున ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
నెలాఖరుకల్లా ప్రతిపాదనలు
జిల్లాలో కొత్త సంఘాల ఏర్పాటు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా జిల్లాలో కొత్త సంఘాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ప్రతి పాదనలు సిద్ధం చేయనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 12 వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా, ఇందులో ఆరు సంఘాలు మాత్రమే క్రీయాశీలకంగా పని చేస్తున్నాయి. దహెగాం, బెజ్జూర్, సిర్పూర్-టీ, కౌటాల, ఆసిఫాబాద్, వాంకిడి మండలాల్లోని సహకార సంఘాల ద్వారా రైతులకు సేవలు అందుతున్నాయి. మిగతావి అంతంతమాత్రంగానే పనిచేస్తున్నాయి. మండలాల్లో అన్ని గ్రామాలకు సమదూరం ఉండేలా సంఘాలను ఏర్పాటు చేయనున్నారు.