హాజీపూర్, ఫిబ్రవరి 11 : జిల్లాలోని 306 గ్రామ పంచాయతీల్లో విడుతల వారీగా ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ మేరకు స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులు, అస్టిటెంట్ రిటర్నింగ్ అధికారులు, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులు, పీవోలు, ఓపీవోలను నియమించింది. ప్రస్తుతం వీరికి కలెక్టరేట్లో శిక్షణ ఇస్తున్నది. మంగళవారం మంచిర్యాల నియోజకవర్గానికి కేటాయించిన అధికారులకు ఎంపీడీవోలు, మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇవ్వగా, బుధవారం ఉదయం బెల్లంపల్లి నియోజకవర్గం, మధ్యాహ్నం చెన్నూర్ నియోజకవర్గాలకు కేటాయించిన ఎన్నికల అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఉదయం 10 గంటల నుంచి చెన్నూర్ నియోజకవర్గంలోని చెన్నూర్, కోటపల్లి, జైపూర్, భీమారం, మందమర్రి మండలాలకు, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, వేమనపల్లి, భీమిని, కన్నెపెల్లి, నెన్నెల మండలాలకు చెందిన రిటర్నింగ్ అధికారులు, అస్టిటెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు, స్టేజ్-1, స్టేజ్-2 అధికారులకు ఎన్నికల నియమావళి, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ విధానం తదితర అంశాలపై సమగ్రంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇక పీవోలు, ఓపీవోలకు ఈనెల 15వ తేదీలోగా మండల స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది.
రెండు విడుతల్లోనే..
జిల్లాలో మూడు విడుతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు ప్రతిపాదించినప్పటికీ రెండు విడుతల్లోనే పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. జిల్లాలోని 306 పంచాయతీలకు 101 క్లస్ట ర్లు విభజించారు. ఒక్కో క్లస్టర్‌కు ఇద్దరు అధికారులను నియమించారు. వారికి అదనంగా మరికొంత మందిని నియమించి శిక్షణ ఇస్తున్నా రు. ఒక ప్రాంతానికి చెందిన అధికారులను మరో ప్రాంతానికి కూడా కేటాయించనున్నారు. స్టేజ్-1 అధికారులకు సహాయంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, స్టేజ్-2 అధికారులను నియమించారు.
ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం
– వెంకటేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి, మంచిర్యాల
ప్రభుత్వం జీపీలకు ఎన్నికలు నిర్వహించాలని ఎప్పుడు ఆదేశించినా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎన్నికల సామగ్రిని మండల కేంద్రాలకు పంపించాం. స్టేజ్-1, స్టేజ్-2, అస్టిటెంట్ రిటర్నింగ్ అధికారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తిచేశాం.