కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : వానకాలం పంటల సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అధికారులు పంటల సాగు, దిగుబడుల వివరాలతో పాటు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 4.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగవనున్నట్లు అధికారులు అంచనాలు తయారు చేశారు. అత్యధికంగా 3,37,374 ఎకరాల్లో పత్తి, 58 వేల ఎకరాల్లో వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇక కంది 44వేల ఎకరాలు, పెసర 2,948 ఎకరాలు, మినుములు 437 ఎకరాలు, సో యాబీన్ 1754 ఎకరాలు, ఇతర పంటలు 9009 ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఇవేగాకుండా చిరుధాన్యాలను సాగు చేసేందుకు కూడా అధికారులు ప్రణాళికలు రూపొందించా రు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు చిరుధాన్యాలను జిల్లాలోనే ఉత్పత్తిచేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భా గంగా రాగి 400ఎకరాలు, కొర్రలు 2600ఎకరాలు, సజ్జలు 800 ఎకరాలు, సామలు 1800 ఎకరాలు, ఊదలు 1080 ఎకరాల్లో సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
వానకాలంలో విత్తనాల కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో అత్యధికంగా సాగవుతున్న పత్తికి 13,883 విత్తనాల ప్యాకెట్లు, వరికి 76,474 క్వింటాళ్లు, కంది విత్తనాలు 1788.88 క్వింటాళ్లు, పెసర 117.92 క్వింటాళ్లు, మినుములు విత్తనాలు 21.85 క్వింటాళ్లు, సోయాబీన్ 526.2 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు వానకాలంలో రైతులు పంటలు వేసేనాటికి విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే చిరుధాన్యాల సాగుకోసం మొత్తం 149.60 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో సాగు చేయనున్న పంటలకు అవసరమైన ఎరువులను తెప్పించేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. యూరియా 46 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 23 వేల మెట్రిక్ టన్నులు, పొటాష్ 23 వేల మెట్రిక్ టన్నులు, సూపర్ఫాస్పేట్ 23 వేల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 20 వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనాలు వేశారు.