మంచిర్యాల అర్బన్, ఆగస్టు 5 : పోలీస్ వాహనాలను ఎప్పటికప్పుడు పరిశీలించి కండిషన్లో ఉంచుకోవాలని రామగుండం కమిషనరేట్ అడిషనల్ అడ్మిన్ డీసీపీ రాజు అన్నారు. సోమవారం కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో మంచిర్యాల పరిధిలోని పెట్రోకార్, రక్షక్, హైవే పెట్రోలింగ్ పోలీసు వాహనాల పనితీరు, వాటి నిర్వహణను పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ వాహనాల నిర్వహణ లోటుపాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని, క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి సమగ్ర నివేదికను నెల వారీగా సమర్పించాలని, మోటార్ వాహనాల అధికారులు, ఇతర అధికారులకు తెలియజేయాలని సిబ్బందికి సూచించారు. విధుల్లో ఉన్నపుడు యూనిఫామ్, సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.