ఎదులాపురం, నవంబర్ 4 : ఆదిలాబాద్ జిల్లాలో మొట్ట మొదటిసారిగా ‘పోలీస్ అక్క’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం స్థానిక సాంఘిక సంక్షేమ కళాశాల, పాఠశాలలో 250 మంది విద్యార్థినుల సమక్షంలో ఎస్పీ పోలీస్ అక కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ చెరువ కావడానికి ప్రతి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక మహిళా పోలీసు కానిస్టేబుల్‌తో పాఠశాల విద్యార్థినులు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కల్పించనున్నారు.
విద్యార్థిని విద్యార్థులకు మహిళా పోలీసు వారానికి రెండు, మూడు రోజులు పాఠశాలలను సందర్శించి అవగాహన కల్పిస్తారు. పోలీసు యంత్రాంగం ఈవ్ టీజింగ్, గుడ్, బ్యాడ్ టచ్, రోడ్లపై ఆకతాయిల వేధింపులు, బాల్యవివాహాలు, సోషల్ మీడియా వేధింపులు, ఫేక్ సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు ఇబ్బందులు కలిగించడం, ప్రేమ పేరిట వేధింపులు, ఫొటోలు, వీడియోలను తీసుకొని వాటి ద్వారా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడడం వంటి వాటిని ధైర్యంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీ ఆదిలాబాద్ జీవన్‌రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ లలిత కుమారి, పట్టణ సీఐలు కర్ర స్వామి, బి.సునీల్ కుమార్, కె.ప్రభాకర్, కె.నాగరాజు, ప్రణయ్ కుమార్, ప్రేమ్ కుమార్, అంజమ్మ పాల్గొన్నారు.