కరీంనగర్, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జగిత్యాల (నమస్తే తెలంగాణ) : ‘పెట్రో ధరలపై ధర్నాలు చేయడం కాదు.. ముందు వడ్లు, మక్కలు కొనండి’ అంటూ హితవుపలికిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై రాష్ట్ర సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా.. ఆగమేఘాల మీద ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్.. సర్కార్‌తోపాటు ఆర్టీసీ యాజమాన్యం తీరుపై భగ్గుమన్నది. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే అందోళన చేస్తామంటూ హెచ్చరించింది. సర్కార్ తీరుపై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిసింది. ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారా? అని నెటిజన్లు మండిపడ్డారు. డ్రైవర్ తొలగింపుపై సర్కార్‌పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సారీ చెబుతూ డ్రైవర్ అశోక్ నుంచి ఓ లేఖను అధికారులు కోరగా.. చేయని తప్పునకు సారీ చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెప్పాడు. చివరకు యాజమాన్యమే దిగొచ్చి.. బుధవారం నుంచి విధుల్లో చేరమని అధికారులు చెప్పడం కొసమెరుపు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిరసనలు చేపట్టారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్, మేడిపల్లి సత్యం, ఇతర కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బస్‌స్టాండ్‌కు వస్తున్న అద్దె ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీ అశోక్.. బస్సులో నుంచి ‘వడ్లు, మకల గురించి పట్టించుకోండి.. పెట్రోల్ రేట్లు ఎప్పుడైనా దించుకోవచ్చు’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. అశోక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, అది సర్కార్‌కు మింగుడు పడలేదు. దీంతో కాంగ్రెస్ నాయకులను ఆర్టీసీ డ్రైవర్ విమర్శించారంటూ కాంగ్రెస్ ధర్మపురి మండల అధ్యక్షుడు లక్ష్మణ్ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు సోమవారం ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా చేసుకొని యాజమాన్యం వెంటనే చర్యలకు ఉపక్రమించింది. అశోక్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వడ్లు, మక్కలు కొనాలని మాట్లాడిన నిరుపేద దళిత ఆర్టీసీ డ్రైవర్‌పై ప్రభుత్వం కక్షగట్టి వేటు వేయడాన్ని అన్నివర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అలూరు గ్రామానికి చెందిన బైరి అశోక్ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అశోక్ భార్య ప్రైవేట్ స్కూల్లో పని చేస్తుండగా, అశోక్ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వీరి కుటుంబం జగిత్యాలలోని పురానిపేటలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అష్టకష్టాలు పడుతూ జీవితాన్ని గడుపుతున్న డ్రైవర్‌పై ప్రభుత్వం కర్కషంగా వ్యవహరించడం సరికాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జగిత్యాలలో రైతుల పక్షాన ప్రశ్నించిన అశోక్ అనే డ్రైవర్‌ను తొలగించారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొట్టిపారేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. వీడియోలో ‘అశోక్ కేవలం ఆర్టీసీ హైర్(అద్దె)బస్సు డ్రైవర్ మాత్రమే. ఆర్టీసీ ఉద్యోగి కాదు. అయినప్పటికే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించవద్దని యాజమాన్యానికి సూచించాం. అశోక్ రైతుల పక్షాన మాట్లాడాడు. దానిని స్వాగతిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. అయినప్పటికీ కొనుగోళ్లు సాఫీగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటున్నది. ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయొద్దు’ అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
‘నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడాను. నేను ఏ పార్టీని విమర్శించలేదు. నాదేం తప్పులేదని అనుకుంటున్నా’ అని డ్రైవర్ బైరి అశోక్ తెలిపాడు. మంగళవారం ఆర్టీసీ అధికారులు విధుల నుంచి తొలగించిన అనంతరం మీడియాతో మాట్లాడాడు. జగిత్యాలలో సోమవారం తహసీల్ చౌరస్తా వద్ద ధర్నా చేస్తున్నది చూశానని తెలిపారు. అక్కడ తమ గ్రామానికి చెందిన వ్యక్తి ఉన్నాడని, ఆయనను ఎందుకు ధర్నా చేస్తున్నారని అడిగానని, పెట్రోల్, డీజిల్ పెంపు కోసం అని చెప్పడంతో బస్సు నడుపుతూనే.. ‘వడ్లు, మక్కల సంగతి చూడండి.. వాటిని కాపాడండి.. పెట్రోల్ ధరలు ఎప్పుడైనా దించవచ్చు’ అంటూ వెళ్లిపోయినట్టు చెప్పాడు. ఇందుకు మంగళవారం ఆర్టీసీ ఆఫీసర్లు పిలిచి విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నాడు. తాను ఏ తప్పూ చేయలేదని, ఏ నాయకుడిని, రాజకీయ పార్టీని విమర్శించలేదని, కేవలం రైతుల గోస చూడాలని, వడ్లు, మక్కలు కొనాలని మాత్రమే చెప్పానని వివరించాడు.
డ్రైవర్ అశోక్ ఏ రాజకీయ పార్టీనిగానీ, నాయకుడినిగానీ విమర్శించలేదని, రైతుల సమస్యను మాత్రమే ప్రస్తావించాడని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. అలాంటి పరిస్థితిలో ఆయనపై చర్యలు తీసుకోవడం కార్మికుడి భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమే అవుతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై స్పందించడం ప్రతి పౌరుడి హకు, బాధ్యత అనీ, అందులో గ్రామీణ తెలంగాణ నుంచి వచ్చిన కార్మికులు రైతు కుటుంబాలకు చెందినవారేనని, అలాంటి ఓ కార్మికుడి హకును వినియోగించినందుకు ఆయనపై చర్యలకు పూనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై స్పందించే ధైర్యాన్ని ప్రదర్శించిన డ్రైవర్ అశోక్‌ను అభినందిస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్‌పై చర్యలు అన్యాయమని ఉద్యోగ సంఘాల జాక్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ విమర్శించారు. కార్మికులకు ప్రజల పక్షాన మాట్లాడే ట్రేడ్ యూనియన్ హకులు ఉంటాయనే, ఈ విషయం తెలియకుండా మూర్ఖంగా వ్యవహరించడం బాధాకరమని మండిపడ్డారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ చర్యను తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ డ్రైవర్ అశోక్.. రైతుల వడ్లు కొనమని కోరడం ఏ మాత్రం తప్పుకాదని తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం(టీజీఏఎస్కే) పేర్కొన్నది. అదేవిధంగా రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు నమోదు చేయడం రెండు తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాల నిరంకుశత్వానికి అద్దం పడుతున్నదని మండిపడింది.
విషయం తెలుసుకున్న బీఆర్ఎస్.. సర్కార్ చర్యలపై భగ్గుమన్నది. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించింది. బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా కమిటీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ కౌన్సిలర్ ఆవారి శివ కేసరిబాబు తదితరులు ఆర్టీసీ జగిత్యాల డిపో మేనేజర్‌ను కలిశారు. ఎలాంటి తప్పు చేయని అశోక్‌ను విధుల నుంచి తొలగించవద్దని, ఉత్తర్వులను వెనక్కి తీసుకొని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని ఆర్టీసీ ఆర్ఎంను కలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్చేసిన తప్పేమిటో చెప్పాలంటూ ప్రశ్నించారు. వెంటనే విధుల్లోకి తీసుకోని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆందోళనకు వెనుకాడమని హెచ్చరించారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలోనూ సర్కార్ చర్యలపై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. వడ్లు, మక్కలు కొనాలని ప్రశ్నిస్తే.. ఉద్యోగం నుంచి తీసివేస్తారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఒక్కసారిగా సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. గమనించిన సర్కార్ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆర్టీసీ అధికారులు అశోక్‌ను పిలిచి.. సారీ చెబుతూ లేఖ రాసిచ్చి విధులకు హాజరుకావాలని సూచించింది. చేయని తప్పునకు సారీ చెప్పే ప్రసక్తే లేదని అశోక్ తెగేసి చెప్పినట్టు సమాచారం. వివాదం ముదురుతుందని గ్రహించిన అధికారులు తిరిగి ఉద్యోగానికి రావాలంటూ అశోక్‌ను పిలిపించి చెప్పినట్టు తెలిసింది. ఇది నోటిమాటగా చెప్పారే తప్ప అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిసింది. ఈ విషయమై ఆర్టీసీ ఆర్ఎంను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా.. అశోక్‌ను విధుల్లో చేరాలని కోరినట్టు తెలిపారు.
కాంగ్రెస్ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. వడ్లు, మక్కలు కొనాలని అడిగిన ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్ అశోక్‌పై చర్యలు సరికాదని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలకు దిగుతారా..? ఇదేనా ప్రజా పాలనా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో విమర్శలు చేసినవారిపై ఎలాంటి కేసులుగానీ, వేధింపులకు గానీ గురి చేయలేదని గుర్తుచేశారు. ప్రజల నుంచి వస్తున్న విమర్శలను కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోవడం లేదని, దళిత బిడ్డ, ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ అశోక్‌ను వేధించడం చూస్తే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తున్నదని మండిపడ్డారు.
ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చర్యలు సరికాదని మాజీ మంత్రి కొప్పు ల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్‌పై 35%, డీజిల్‌పై 27% వ్యాట్ వసూలు చేస్తున్నారని, అందులో వ్యాట్‌ను పది శాతం తగ్గిస్తే ప్రజలపై భారం తగ్గుతుందని సూచించారు. పన్ను తగ్గించే ఉద్దేశం లేకపోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ఆరోపించారు. కల్లాల్లోని ధాన్యం కల్లాల్లో వర్షం కురిస్తే రైతుల పరిస్థితి ఏంటనే ఆవేదనతో డ్రైవర్ ఆ మాటలు మాట్లాడారే తప్ప, అందులో ఎలాంటి విమర్శలు లేవని తెలిపారు.
కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి సూచించారు. ధాన్యం కొనాలని ప్రశ్నించిన దళిత బిడ్డ అశోక్‌కు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ తోడుదొంగలని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మంత్రి, ఎమ్మెల్యేలు నిరసనలు తెలుపడం చూస్తే ప్రజలు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి కండ్లు తెరిచి ఈ నెల 31లోగా ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.