జయశంకర్ భూపాలపల్లి, మే 26 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం-మంథని జాతీయ రహదారిపై ఉన్న కాటారం వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ధాన్యం బస్తాలతో వచ్చి వ్యవసాయ మార్కెట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన ఎనిమిది మంది రైతులపై, అదీ ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసులు నమోదుచేయడం వివాదాస్పదమైంది.
కొందరు వ్యక్తులు కాటారం వ్యవసాయ మార్కెట్ వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డుపై వెళ్తున్న వాహనాలను అడ్డగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని, ప్రశ్నిస్తే తమను దుర్భాషలాడి విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ బీ దేవేందర్ అనే కానిస్టేబుల్ కాటారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రైతులు గాలి మానెం రాజబాబు, కొండపర్తి రవి, కొండగొర్ల వెంకటస్వామి, రామిల్ల రాజబాపు, మాడెం రవి, కొండ తిరుపతి, బొమ్మ తిరుపతిరెడ్డిపై 126 (2), 132, 292, ఆర్/డబ్ల్యూ, 3(5), బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కాటారం మండలంలో 12,600 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్కు తీసుకొని రాగా, ఇప్పటివరకు ప్రభుత్వం అందులో సగం కూడా కొనుగోలు చేయలేదని, కాంటా పెట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ వ్యవహారంపై సోషల్మీడియాలో ఇదేనా ప్రజాపాలన? ఇందిరమ్మ రాజ్యం? అంటూ నెట్జన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రైతులు పండించే పంటను కొనుగోలు చేసే సత్తా లేని ప్రభుత్వానికి సంకెళ్లు వేసే హక్కు ఎక్కడిదని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1.60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటివరకు 160 కేంద్రాల ద్వారా 60 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 45 వేల టన్నుల ధాన్యాన్ని మాత్రమే తరలించారు. ఇంకా కొనుగోళ్లు పూర్తికాని సుమారు 1.15 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతున్నది. మళ్లీ పంటలు వేసేందుకు సిద్ధమవ్వాల్సిన తరుణంలో ధాన్యం అమ్ముకోవడమే కష్టంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే, ఎనిమిది బాయిల్డ్ మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేశామని, అదనంగా హనుమకొండ, పెద్దపల్లి మిల్లులకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.
ఏప్రిల్ చివరి వారంలో వడ్లు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాం. ఇప్పటివరకూ కొనడం లేదు. దీంతో రైతులమంతా కాటారం వ్యవసాయ మార్కెట్ వద్ద ధర్నా చేశాం. మా ఆవేదన విన్నవించాం. ఇది తప్పా? మాపై అక్రమంగా కేసులు పెట్టారు. పోలీసులు రైతులకు మద్దతుగా ఉండాల్సింది పోయి మా పైనే కేసులు పెట్టారు.
-గాలి సడవలి, రైతు,కాటారం
వడ్లు మార్కెట్కు తెచ్చి 40 రోజులు పైబడింది. వడ్లను కొంటలేరు. కొన్న ధాన్యాన్ని మిల్లులకు తీసుకపోతలేరు. వర్షాలు వచ్చేలా ఉన్నాయి. ఏం చేయాలో తోచడంలేదు. అందరం అనుకుని రోడ్డెక్కి శాంతియుతంగా నిరసన తెలిపినం. మా పరిస్థితిని ప్రభుత్వానికి విన్నవించాం. మేం దురుసుగా ప్రవర్తించలేదు. ఎవరి విధులకూ ఆటంకం కలిగించలేదు. అయినా 8 మందిపై కేసులు పెట్టారు.
– ఎం రాజబాబు, ఎర్రగుంటపల్లి, కాటారం