నిర్మల్ అర్బన్, మార్చి 7 : నిర్మల్ ఎస్పీగా జానకీ షర్మిల బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షిస్తూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమస్యాత్మక ప్రాంతంగా పేరున్న జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు, నిర్మల్, భైంసాలో వినాయక, దుర్గామాత ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించి అందరి మన్నలను పొం దారు. బాసర ట్రిపుల్ ఐటీని దత్తత తీసుకుని విద్యార్థుల్లో ఆత్మహత్యల నివారణ కోసం కెరీర్ గైడెన్స్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపా రు. వీటితో పాటు మహిళా దినోత్సవం సందర్భంగా రా ష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నారీశక్తి కార్యక్రమంలో భా గంగా మహిళా పోలీసులకు పెట్రోకార్ విధులను అప్పగించడం, మహిళలు, విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా ‘పోలీస్ అక్క’పేరుతో వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజల తో పాటు, ఉన్నతాధికారులు మన్ననలు అందుకున్నారు.
నిర్మల్ జిల్లాలోని 5 సర్కిళ్ల పరిధిలోని 20 పోలీస్ స్టేషన్లలోని మహిళా కానిస్టేబుళ్లు రిసెప్షన్ విధులకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు, ముఖ్యనేతల పర్యటనల విధులకు మాత్రం స్టేషన్ను వదిలి బ యటకు వచ్చేవారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా జిల్లా ఎస్పీ జానకీ షర్మిల స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులకు నారీశక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా పెట్రోకార్ విధులను అప్పగించారు. వారంలో ఒక రోజు పురుష కానిస్టేబుళ్లతో సమానంగా డయల్ 100 కాల్ అటెంప్ట్, వాహనాల తనిఖీలు, పాయింట్ బుక్ చెకింగ్, ఎంవో అఫెండర్స్తో పాటు ఇతర విధులను నిర్వహించనున్నారు.
నిర్మల్ జిల్లాలో మహిళలు, విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా ముందుకు సాగేందుకు జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ‘పోలీస్ అక్క’ పేరుతో జిల్లాలోని 18 కేజీబీవీ పాఠశాలలను మహిళా పోలీసులు దత్తత తీసుకున్నారు. నెలకోసారి ప్రభుత్వ బాలికల విద్యాసంస్థలను సందర్శించి హాస్టల్లో అక్కడే బస చేసి విద్యార్థులకు ‘గుడ్ టచ్..బ్యాడ్ టచ్, సైబర్ క్రైమ్, పాఠశాలలో సమస్యలు, విద్యార్థినులపై వేధింపులు నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. సమస్యలను తెలుసుకొని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తూ విద్యార్థినులకు అండగా నిలుస్తున్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పోలీసు శాఖ కు వన్నె తీసుకువచ్చేలా మహిళా పోలీసులకు పెట్రోకార్ విధులు కేటాయించడం, ‘పోలీస్ అక్క’,‘ నారీశక్తి’కార్యక్రమాలను ప్రారంభించిన ఎస్పీ జానకీ షర్మిలను రాష్ట్ర డీజీపీ జితేందర్ ‘ఎక్స్’ వేదికగా అభినందించారు. జిల్లా ప్రజలు సైతం ఎస్పీకి అభినందనలు తెలుపుతున్నారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో నారీ శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా కానిస్టేబుళ్లకు పెట్రోకార్ విధులు అప్పగించాం. తొలిరోజు అద్భుతంగా విధులు నిర్వహించారు. కేజీబీవీ పాఠశాలల్లో విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా ‘ పోలీస్ అక్క’ పేరుతో మహిళా పోలీసులు హాస్టల్లో నెలలో ఒక రోజు బస చేసి వారి యోగక్షేమాలను తెలుసుకొని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
-ఎస్పీ జానకీ షర్మిల, నిర్మల్
మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఎస్పీ జానకి షర్మిల మేడం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరం. ఇప్పటి వరకు మహిళా పోలీసులు అనగానే రిసెప్షన్ సేవలకే పరిమితమైన మాకు మెన్ పీసీలతో సమానంగా బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉంది.
– కీర్తన రెడ్డి, కానిస్టేబుల్, సోన్
వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘పోలీస్ అక్క’ సేవల పేరుతో విద్యార్థినుల సమస్యలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించడంతో పాటు జఠిలమైన సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. నెలలో ఒక రోజు వసతి గృహాలను సందర్శించి అక్కడే బస చేసి విద్యార్థినులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తాం.
– రజిత, కానిస్టేబుల్, నిర్మల్టౌన్