నిర్మల్ జిల్లాలో పేకాట జోరుగాసాగుతున్నది. సరదాగా మొదలై.. ఆ తర్వాత బానిసై జేబులను గుల్లచేస్తున్నది. నిర్మల్, భైంసా, ఖానాపూర్లో విచ్చలవిడిగా పెరిగిన ఈ సంస్కృతి, ఇప్పుడు పట్టణాలతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోకి సైతం వ్యాపించింది. యువత కూడా బానిసలవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పట్టుబడితే సాధారణ కేసుల కారణంగా పేకాటకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. – నిర్మల్ అర్బన్, అక్టోబర్ 25
శివారు ప్రాంతాలు.. లాడ్జీల్లోనే మకాం..
పేకాట రాయుళ్లు తమ ఆటకు ఇబ్బందుల్లేని.., పోలీసులు, కుటుంబ సభ్యులకు అనుమానం రాని రహస్య ప్రదేశాలను ఎంచుకుంట్నురు. నిర్మల్, భైంసాలోని పలు లాడ్జీలు, కాలనీల్లోని శివారు ప్రాంతాల్లో గల పురాతన ఇండ్ల ను అద్దెకు తీసుకుంటూ ఎవరికీ అనుమానం రాకుండా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈ క్రీడను కొనసాగిస్తున్నారు. గ్రామాలు, మండల కేంద్రాల్లోని రహస్య ప్రదేశాల్లో పేకాట ఆడుతున్నారు. కొందరు ఏ పనులూ చేయకుండా పేకాటనే వృత్తిగా మలుచుకున్నారు. పేకాట ప్రదేశంలో చిన్నాచితక గొడవలు జరిగి పోలీసుల దృష్టికి వస్తే దాడులు చేస్తున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, కేసులు నమోదు చేస్తున్నారు.
ఏటా పెరుగుతున్న కేసులు..
నిర్మల్ జిల్లాలో ఏటా పేకాట కేసుల సంఖ్య పెరిగిపోతున్నది. 2017-22తో పోల్చితే కేవలం 2021లో కేసుల సంఖ్య కాస్త తగ్గినా ఏటా కేసులతో పాటు పట్టుబడిన పేకాట వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ ఆరేండ్లలో మొత్తం 614 కేసులు నమోదయ్యాయి. వీటిలో 2019లో అత్యధిక కేసులతో పాటు రూ.22 లక్షల 65 వేలు పట్టుబడింది. మొత్తంగా 614 మంది పట్టుబడగా, వీరి నుంచి రూ.69 లక్షల 69వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
క్రిమినల్ కేసులు నమోదుచేస్తాం..
పేకాట రాయుళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా పోలీసులు అక్కడికి వెళ్లి కేసులు నమోదు చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని ఇండ్లను గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వకుండా పోలీసులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక నిఘా పెట్టడంతో ఇతర రాష్ర్టాలకు వెళ్లి పేకాడుతున్నట్లు మా దృ ష్టికి వచ్చింది. పేకాట ఆడినా, వాటిని ఆడించిన సం బంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
– ప్రవీణ్ కుమార్, ఎస్పీ, నిర్మల్ జిల్లా