ఎదులాపురం, డిసెంబర్ 10 : ఆదిలాబాద్ పోలీస్ పరేడ్ మైదనంలో మూడోరోజైన శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 873 మంది అభ్యర్థులకు గాను 734 మంది హాజరయ్యారు. ఇందులో 482 మంది అన్ని అంశాల్లో ఉత్తీర్ణత సాధించి తుది పరీక్షకు అర్హత పొందారు. 261 మంది వివిధ అంశాల్లో విఫలమై వెనుదిరిగారు. మహిళా అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించారు. వీరి ద్వారా పర్యవేక్షణ చేస్తూ, ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మహిళా కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, ఎస్ఐలను నియమించి ఈవెంట్స్ నిర్వహించారు.
సోమవారం సైతం మహిళలకే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. మగవారి కంటే ఆడవారే తుది పరీక్షకు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించడం సంతోషం కలిగించే విషయమని పేర్కొన్నారు. అధికారులు అదనపు ఎస్పీలు ఎస్.శ్రీనివాసరావు, సీ సమయ్‌జాన్‌రావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాస్తవ్, డీఎస్పీలు వీ ఉమేందర్, వీ వెంకటేశ్వర్ రావు, ఎస్ ఉపేందర్, ఉమామహేశ్వరరావు, సీఐలు, మహిళా ఎస్ఐలు, ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్, ట్రాఫిక్ కమ్యూనికేషన్, స్పెషల్‌పార్టీ, క్యూఆర్టీ, ఉమ్మడి జిల్లా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.