కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : అటవీ ప్రాంత గిరిజన గర్భిణులకు ప్రసవమంటే పునర్జన్మతో సమానమవుతున్నది. అనేక పల్లెలకు రోడ్లు, వంతెనలు లేకపోగా, అంబులెన్స్‌లు వెళ్లలేని పరిస్థితిలో నిండు గర్భిణులు ప్రత్యక్ష నరకం అనుభవించాల్సి వస్తున్నది. పురిటినొప్పులతో కాలినడకన వాగులు.. వంకలు.. మొకాళ్ల లోతు బురద.. రాళ్లు.. రప్పలు దాటాల్సిన దుస్థితి నెలకొంది. దవాఖానకు చేరుకునే లోపు తల్లీబిడ్డల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతున్నది. యేటా జిల్లాలో అనేక మంది మృత్యువాత పడుతుండగా, ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు తీవ్ర వేదనకు గురిచేశాయి.
ఈ నెల 9న ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని టిమ్రన్ మోవాడ్ బండగూడకు చెందిన ఆత్రం ధర్ముబాయ్ అనే ఆదివాసీ గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. 108కి ఫోన్ చేయగా, గ్రామానికి వచ్చే దారిలోనున్న వాగుపై వంతెన లేకపోవడంతో అవతలి ఒడ్డు వైపే వాహనాన్ని నిలిపివేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో ధర్ముబాయ్ గ్రామం నుంచి వాగు వరకు 1.5 కిలోమీటరు మేర నడుచుకుంటూ వచ్చింది. అతికష్టం మీద వాగు దాటింది.
ఈ క్రమంలో నొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్స్ సిబ్బంది డెలివరీ చేశారు. ఆడ శిశువుకు జన్మనివ్వగా, గర్భంలో మరో శిశువు ఉందని గమనించిన అంబులెన్స్ సిబ్బంది ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడికి చేరుకోగానే శిశువు మరణించింది. కడుపులో ఉన్న మరో శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మంచిర్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ మరో పాపకు జన్మనిచ్చింది.
ఈ నెల 6న కెరమెరి మండలం పరస్వాడకు చెందిన కల్పనకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆ గ్రామానికి అంబులెన్స్ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తన తల్లిదండ్రుల సాయంతో అటవీ ప్రాంతం నుంచి గుట్టలు ఎక్కి.. రాళ్లు.. రప్పలు దాటి నాలుగు కిలో మీటర్లు నడిచి కేలి(బీ)కి చేరుకున్నది. అక్కడి నుంచి ఎడ్ల బండిలో కెరమెరి ప్రాథమిక ఆరోగ్యాకేంద్రానికి అతికష్టం మీద చేరింది. దవాఖానలో శిశువుకు జన్మనిచ్చింది.
గత నెల 26న భారీ వర్షాలకు బెజ్జూర్ మండలాన్ని ఆనుకొని ఉన్న ప్రాణహిత ఉప్పొంగి ప్రవహించింది. తలాయి, తిక్కపల్లి, భీమారం గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. తలాయి గ్రామానికి చెందిన లంగారి లావణ్య, లంగారి మేఘన 9 నెలల నిండు గర్భిణులు. వీరిని వైద్యం కోసం బెజ్జూర్ మండల కేంద్రానికి నాటు పడవల్లో ప్రమాదకర పరిస్థితుల్లో తరలించారు. ఆపై కాన్పుకోసం తల్లిగారి ఊర్ల(దహెగాం మండలం ఒడ్డుగూడ, రాస్పల్లి)కు వెళ్లారు.
ఇలా జిల్లాలో అనేక గ్రామాలకు రోడ్లు, వంతెనలు లేవు. వర్షాకాలం వచ్చిందంటే ఆయా గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులు.. వంకలు దాటాల్సి వస్తున్నది. ప్రధానంగా గర్భిణుల కష్టాలు వర్ణనాతీతం.
Adilabad5