హాజీపూర్, ఆగస్టు 16 : వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును శనివారం ఆయన సందర్శించారు. 24 గంట ల నుంచి 36 గంటలు భారీ వర్షసూచన ఉన్నదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, ప్రాణ, ఆస్థినష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సేవల కోసం 08736-250501కు ఫోన్ చేయాలని తెలిపారు. ఆయన వెంట హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రావ్ దేశ్ పాండే, సంబంధిత శాఖల అధికారులున్నారు.
లక్షెట్టిపేట, ఆగస్టు 16 : భారీ నుంచి అతి భారీ వర్షాల సూచన ఉన్నందున ప్రజలకు ఇబ్బందుల్లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9, 12, 13 వార్డుల్లో పర్యటించి, వర్షపు నీటి స్థితిని, అలాగే కొత్త కొమ్ముగూడెంలోని చెరువును తహసీల్దార్ దిలీప్ కుమార్తో కలిసి పరిశీలించారు. వరద వస్తే ఎదుర్కొనేందుకు 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, జిల్లా అధికారులతో సిద్ధంగా ఉన్నామని, ప్రజల రక్షణకు కావలసిన పరికరాలు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. మున్సిపల్ కమిషనర్ సంపత్తో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి, రిజిస్టర్లు పరిశీలించారు. ఆ తర్వాత మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ దవాఖాన సందర్శించి, వార్డు లు, ల్యాబ్, రిజిస్టర్లు, పరిసరాలు పరిశీలించారు.
కోటపల్లి, ఆగస్టు 16 : అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎదుల్లబంధం సమీపంలో కోతకు గురైన రోడ్డును సందర్శించారు. ఈ మార్గంలో భారీ వాహనాలకు అనుమతి ఇవ్వవద్దని అధికారులకు సూచించారు. ఇ సుక బస్తాలతో రోడ్డుకు మరమ్మతులు చేసి, రాకపోకల పునరుద్ధరించాలన్నారు. ప్రాణహిత, గోదావరి ప్రవాహం పెరుగుతున్నందున సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తహసీల్దార్ రాఘవేంద్రరావ్, ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సమ్మయ్య ఉన్నారు.