చెన్నూర్ టౌన్, సెప్టెంబర్ 15 : పట్టణంలో గణేశ్ విగ్రహాల నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర సోమవారం ఉదయం వరకూ కొనసాగింది. స్థానిక మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన గిల్దా, వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కమిషనర్ గంగాధర్, కౌన్సిలరు జోడు శంకర్, కో ఆప్షన్ మెంబర్లు, బీఆర్ఎస్ నాయకులు రాంలాల్ గిల్డా, నాయిని సతీశ్, కో ఆప్షన్ మెంబర్ కేయం శ్రీనివాస్, ఏఈ సాయి అర్చకులు, హిందూ ఉత్సవ సమితి, వివిధ పార్టీల నాయకులు ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో విద్యుత్, పోలీస్, అటవీశాఖ, వైద్య శాఖలు సంయుక్తంగా పాల్గొన్నాయి.
మహంకాళివాడ, గెర్రెకాలనీ, బలిజవాడతో పాటు పట్టణంలోని పలు కాలనీల్లో వినాయులను నిమజ్జనం చేశారు. ప్రధాన వీధుల్లో భక్తులు కోలాటాలు, నృత్యాలు, భజనలతో సందడి చేశారు. గాంధీచౌక్‌లో చెన్నూర్ మున్సిపాలిటీ, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటు చేశారు. పెద్ద చెరువు వద్ద గజ ఈతగాళ్లతో పాటు బోటును అందుబాటులో ఉంచారు. పెద్ద చెరువులో భారీ క్రేన్ సాయంతో పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక చానళ్లలో శోభాయాత్రను ప్రత్యక్ష ప్రసారం చేశారు. కెరమెరి, సెప్టెంబర్ 15 : మండలంలోని జ్యోతిన గర్(ఝరి) గ్రామంలో వినాయక నిమజ్జనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రధాన వీధులగుండా శోభాయాత్ర సాగింది. ఖైరి పెద్ద వాగులో గణనాథుని నిమజ్జనం చేశారు. పలుచోట్ల భక్తులకు అన్నదానం చేశారు.