నిర్మల్, మే 28(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్(ఐడీఓసీ) భవనం మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నది. కేసీఆర్ ముందుచూపుతో ఒకేచోట అన్ని ప్రభుత్వ శాఖలు ఉండేలా ఈ సముదాయాన్ని నిర్మించింది. కానీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టరేట్ల నిర్వహణను గాలికొదిలేసిందన్న విమర్శలు ఉన్నాయి. కలెక్టరేట్ ప్రాంగణంలో నీడ సదుపాయం కరువైంది.
వాహనాలకు పార్కింగ్ షెడ్లు లేకపోవడంతో వందలాది వాహనాలు మండుటెండలోనే మగ్గిపోతున్నాయి. కనీసం పార్కింగ్ షెడ్ల నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. 40 శాఖల్లో పనిచేసే ఉన్నతాధికారులు, సిబ్బందితోపాటు వందలాది మంది ప్రజలు వస్తుంటారు. ద్విచక్రవాహనాలు, కార్లకు పార్కింగ్ చేసేందుకు నీడ సౌకర్యం లేదు. ఫలితంగా కలెక్టరేట్ ఆవరణలో పార్క్ చేసిన వాహనాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాలు మండుటెండలోనే ఉంచాల్సి వస్తున్నది. వాహనాల రంగు వెలిసిపోవడమే కాకుండా, ఎండ వేడికి ఇంజిన్లు, టైర్లు, బ్యాటరీలు పాడవుతున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. టాయిలెట్ల నిర్వహణ కూడా సక్రమంగా లేదు. లిఫ్ట్ పని చేయకపోవడంతో మెట్ల మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. కనీసం మెయింటెనెన్స్ నిధులు ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. ఉన్నతాధికారులు స్పందించి అవసరమైన సదుపాయాలు కల్పించి, పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయించాలని ప్రజలు, ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు.