సీసీసీ నస్పూర్ : ఏప్రిల్ 1వ తేదీ నుంచి సింగరేణిలో కాగితపు రహిత (Paperless services) సేవలు అందుబాటులోకి రానున్నాయని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ (Srirampur GM Srinivas) తెలిపారు. శుక్రవారం సీసీసీ సింగరేణి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ (FLM)పై శ్రీరాంపూర్ ఏరియా అధికారులకు ఐటీ డీజీఎం హరిప్రసాద్, ఐటీ మేనేజర్ కిరణ్ కుమార్, సీనియర్ ప్రోగ్రామర్ శంకర్, ట్రైనీ ప్రోగ్రామర్ రమ్య బృందం ఆధ్వర్యంలో అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జీఎం శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ కాగితపు రహిత సేవలు అందిస్తున్న టెక్నాలజీని అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే వినియోగిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం సింగరేణిలో (Singareni) సాప్ను వినియోగించుకుని చాలా వరకు పనులను సులభతరం, కచ్చితత్వంగా చేయడం జరుగుతుందన్నారు.
నూతన సాంకేతికతతో కాగితపు రహిత సేవలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ద్వారా కాగితం యొక్క వినియోగం గణనీయంగా తగ్గుతుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ సేవలు సింగరేణిలో పూర్తిగా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు పాల్గొన్నారు.