నిర్మల్ టౌన్, ఆగస్టు 10 ః తెలంగాణ రావడం వల్లనే ఉద్యోగ భద్రత సాధ్యమైంది. సీఎం కేసీఆర్ మాట ఇస్తే నిలబెట్టుకునే వ్యక్తి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు ఉద్యోగ భద్రత కోసం ఎన్నో పోరాటాలు చేశారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాగింది. నీళ్లు, నిధులు వచ్చాయి. మీకు ఉద్యోగ భద్రత కూడా వచ్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్‌లో వీఆర్ఏలుగా పని చేస్తున్న 569 మందికి వివిధ శాఖల్లో సర్దుబాటు ప్రక్రియ పూర్తి, నియామక పత్రాలు అందించారు. అదేవిధంగా 2018లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన వారిలో మెరిట్ ఆధారంగా 219 మంది జేపీఎస్‌లకు 138 మందికి రెగ్యులర్ హోదా కల్పిస్తూ నియామక పత్రాలు కలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి అందించారు. రాష్ట్ర చరిత్రలోనే ఒకేరోజు జేపీఎస్‌లను, వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పేస్కేలు, అలవెన్సులు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. వీఆర్ఏలు, జేపీఎస్‌లు కష్టపడి పని చేయాలని సూచించారు.
రాష్ర్టానికి మోడల్‌గా నిలపాలి..
ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రారంభించినా.. సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందిస్తున్నదని కలెక్టర్ వరుణ్‌రెడ్డి అన్నారు. జేపీఎస్‌లు కష్టపడి పని చేయడం వల్లనే శ్మాశాన వాటికలు, రైతు వేదికలు, సీసీ రో డ్లు, గ్రామ పంచాయతీలు, హరితహారంలో మొక్కలు, నీటిగుంతలు నిర్మించి జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపారన్నారు. వీఆర్ఏలు కూడా గ్రామస్థాయిలో ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, సారంగాపూర్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, డీపీవో శ్రీలత, ఇన్చార్జి డీఆర్వో లోకేశ్వర్‌రావు, డీఎల్పీవో రమేశ్, శివకృష్ణ, వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాదేమియా, జిల్లా నాయకులు జమాల్, కిషన్, రాధ, ప్రవీణ్, నాయకులు చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ వీఆర్ఏలు, జేపీఎస్‌లు స్వీట్లు పంచిపెట్టారు.
ప్రభుత్వ ఉద్యోగినయ్యా..
నేను డిగ్రీ వరకు చదువుకున్నా. హైదరాబాద్‌లోని విజ్ఞాన సంస్థలో చదువుకుంటున్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం నడుస్తోంది. ఆంధ్రవాళ్లు కేసీఆర్‌పై ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవారు. తెలంగాణ వస్తే మీకే మొస్తదంటే మాకు బాధ కలిగింది. తెలంగాణ వస్తే మా నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని కొట్లాడినం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. 2018లో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం వచ్చి బాసరలో విధులు నిర్వహిస్తున్నా. ఇప్పుడు నాకు ఉద్యోగ భద్రత కల్పించడంతో సంతోషంగా ఉంది.
– హరీశ్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, బాసర.
మరిచిపోం..
కేసీఆర్ ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు మరిచిపోం. మాది నిర్మల్ పట్టణం. 2019లో ఇద్దరం ఒకేసారి పరీక్ష రాసి జేపీఎస్‌గా ఎంపికయ్యాం. ఒకరం ఆరెపల్లి, మరొకరం మామడ మండలంలోని లింగంపల్లిలో విధులు నిర్వహిస్తున్నాం. మేము 2020లో పెండ్లి చేసుకున్నాం. 2019లో ఇద్దరికి ఒకేసారి ఉద్యోగం రావడం, 2020లో పెండ్లి చేసుకోవడం, 2023లో ఇద్దరికీ ఉద్యోగ భద్రత కల్పించడం ఎప్పటికీ మరచిపోలేం. గిరిజన తండాల్లో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే అవకాశం ఇచ్చినందుకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాం.
– శ్రీను-శ్రావ్య, జేపీఎస్ దంపతులు, నిర్మల్.
రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం..
రాష్ట్ర చరిత్రలో మాకు ఈ రోజు సువర్ణాధ్యాయం. సీఎం కేసీఆ ర్కు రెవెన్యూ శాఖ ఉద్యోగులంటే చిన్నచూపు ఉండేదని ఎన్నోసార్లు అనుకున్నాం. ఎప్పుడు ఆందోళన చేసినా మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వీఆర్ఏలను వివిధ శాఖలకు బదలాయిస్తూ, క్రమబద్ధీకరణ చేయడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తెస్తాం.
– దాదేమియా, వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
జీవితంలో మరిచిపోలేనిది..
తెలంగాణ వస్తే ఏమొస్తదో మాకు ఇప్పుడు అర్థమైంది. ఉన్నత చదువులు చదివినా అప్పట్లో ఉద్యోగం రాకపోవడంతో మానసిక ఆవేదనకు గురయ్యాం. 2018లో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా నోటిఫికేషన్ రావడంతో భార్యాభర్తలమైన మేము దరఖాస్తు చేసుకున్నాం. పరీక్ష రాసి 2018లో జేపీఎస్‌గా ఇద్దరం ఒకేసారి ఎంపికయ్యాం. దిలావర్పూర్ మండలంలోని మాడేగాంలో ఒకరం, కాల్వలో మరొకరం విధులు నిర్వహిస్తున్నాం. మాకు పాప ఉంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికై మాకు ఉద్యోగ భద్రత కల్పించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.
– సునీల్-కల్యాణి, దంపతులు, జేపీఎస్ ఉద్యోగులు, వడ్యాల్.