పుస్తకాలు పట్టాల్సిన చేతులు.. పలుగు.. పారా పడుతున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల్లో పుట్టిన చిన్నారులు కూలీలుగా మారుతున్నారు. బట్టల షాపులు, కిరాణా దుకాణాలు, ఫ్యాక్టరీలు, మిర్చి బండ్లు, హోటళ్లలో పనిచేస్తూ పొట్ట పోసుకుంటున్నారు. చదువుకోవాలనే కోరిక ఉన్నా.. ముక్కు పచ్చలారని వయసులో బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు.
వెట్టిచాకిరీని రూపుమాపాలనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ ప్రవేశపెట్టింది. గడిచిన ఆరేండ్లుగా వేలాది మంది బాల కార్మికులకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి ప్రసాదించి.. చదువుల తల్లి ఒడికి చేరుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జనవరి 1వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’
మంచిర్యాల, జనవరి 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేసీఆర్ ప్రభుత్వం 2017 సంవత్సరంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. యేడాదికి రెండు (జనవరి, జూలై) సార్లు బాల కార్మికులను గుర్తిస్తున్నారు. ఈ రెండు నెలలతోపాటు ప్రత్యేక బృందాలు కూడా పిల్లలను గుర్తించి విముక్తి కల్పిస్తున్నాయి. ప్రతి నియోజవర్గానికి ఒక బృందం పని చేస్తుండగా.. ప్రతి టీమ్‌లో ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు, ఒక స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి, ఒక కార్మిక శాఖ అధికారి మొత్తం ఏడుగురు ఉన్నారు. వీరు పనులు చేసే పిల్లలను గుర్తించడం, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లలు చదువుకునేలా చేయడం, అనాథ పిల్లలను చేరదీసి చదివించేలా చర్యలు తీసుకోవడం చేస్తున్నారు.
గడిచిన ఆరేండ్లలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6,369 మంది బాల కార్మికులను గుర్తించారు. వీరిలో బాలురు 4,798, బాలికలు 1,571 ఉన్నారు. ఇందులో 5,745 మంది పిల్లల తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఆ పిల్లలను పాఠశాలల్లో చేర్పించారు. వీరిలో తల్లిదండ్రులు లేని, ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న పిల్లలు 624 మందిని ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో ఉంచారు. బాల కార్మికు లు అధికంగా బేకరీలు, ఫ్యాక్టరీలు, బట్టల దుకాణాలు, ఫ్రూట్స్ షాపులు, మిర్చి బండ్లు, హోటళ్లు, చిరువ్యాపారాలు చేసే సెంటర్లలో ఉంటున్నారు. 14ఏండ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోకూడనే నిబంధనను పట్టించుకోని యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
మంచిర్యాల జిల్లాలో పదో విడుత ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమా న్ని ప్రారంభించాం. జనవరి 1వ తేదీ సెలవు వచ్చినందున 2వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్‌లో మూడు ప్రత్యేక బృందాలు రెండు నెలలపాటు పని చే స్తున్నాయి. బాల కార్మిక పిల్లలను బడుల్లో చే ర్పిస్తాం. ఒకేసారి బడిలో చేర్చి వదిలేయకుండా మానిటరింగ్ చేస్తాం. ఇందులో పోలీసుశాఖ సహకారం మరువలేనిది. బేటీ బచావో ఆందోళన్(బీబీఏ)లాంటి స్వచ్ఛంద సంస్థలు మాతో కలిసి పని చేస్తున్నాయి.
– కొట్టె చిన్నయ్య, జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారి, మంచిర్యాల.