కుభీర్ : గణేష్ మండపాల ( Ganesh Mandapams ) నిర్వహణకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని భైంసా రూరల్ సీఐ నైలు నాయక్ ( CI Nile Nayak ) సూచించారు. గురువారం మండల కేంద్రం కుభీర్లోని పోలీస్ స్టేషన్లో ఎస్సై ఏ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల గణేష్ మండపాల నిర్వాహకులు, గ్రామ పెద్దలతో నిర్వహించిన శాంతి కమిటీ ( Peace Committee ) సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నిర్వాహక కమిటీ సభ్యులు తప్పనిసరిగా అనుమతి పొందాలన్నారు.
మండపాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు పంచాయతీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ నుంచి ఎన్వోసీలు జత చేయాలన్నారు. అనుమతులు పొందిన తరువాతనే మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద పేకాటకు పాల్పడితే డయల్ 100 సమాచారం ఇవ్వాలని, మండపాల వద్ద రాత్రి పూట నిర్వహణ కమిటీ ప్రతినిధులు కాపలా ఉండాలని, సీసీ టీవీలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.
మండపాల్లో సాంప్రదాయ భక్తి కార్యక్రమాలు, భక్తి పాటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఊరేగింపులో అనుచిత, ఆశ్లీల నృత్యాలు, ఆశ్లీల పాటలు, లౌడ్ స్పీకర్లు వంటివి నిషిద్ధమన్నారు. అనుమతి లేకుండా మందుగుండు, డీజేలు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఊరేగింపులో ఇతర కులాలు, మతాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం, ఉపన్యాసాలు చేయడం తగదన్నారు.
వినాయకుడి విగ్రహాలను నెలకొల్పి ప్రజల్లో భక్తి భావన పెంపొందించేలా మండపం నిర్వాహకులు మసలు కోవాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఏశాల దత్తాత్రి, బందెల శంకర్, బోయిడి అభిషేక్, బి శేఖర్, బ్యారపు కానోబా, నారాయణ, మడి ప్రవీణ్, గ్రామాల నాయకులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.