ఇచ్చోడ, జనవరి 8 : ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి పకడ్బందీగా చర్యలు చేపట్టింది. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వం భావించి నిధులు వినియోగంలో పల్లెలకే అధికారం ఇచ్చింది.దీంతో పల్లెలు ప్రగతిలో పరుగులు పెట్టనున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 91తో గ్రామాలకు ఊరట లభించింది. అత్యవసర సమయంలో అభివృద్ధి పనులకు ఆటంకాలు తొలగాయి. గతంలో గ్రామ పంచాయతీల్లో ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టాలంటే ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. పనులు నత్తనడకన జరిగేవి. ఉన్నతాధికారుల నుంచి సకాలంలో అనుమతులు లభించక అత్యవసర పనులు కూడా నిర్వహించలేని దుస్థితి ఉండేది. దీంతో పల్లెల్లో అత్యవసరమైన పనులు ఉన్నా చేపట్టకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు, సర్పంచ్లు తరుచూ ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం ఈ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది.
బోథ్ నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల్లో 239 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సిరికొండ మండలంలో 19 గ్రామ పంచాయతీలు, 36 గ్రామాలు, ఇచ్చోడ మండలంలో 32 గ్రామ పంచాయతీలు, 32 గ్రామాలు ఉన్నాయి. జిల్లాల్లో 468 జీపీలు ఉన్నాయి. మొత్తం 1145 గ్రామాల్లో అత్యవసర పనుల అభివృద్ధికి గ్రామసభల ద్వారా నిధులు వెచ్చించనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 91తో ప్రస్తుతం గ్రామాల్లో అభివృద్ధి పనులు పుంజుకుంటున్నాయి. ఎలాంటి ఆటంకం లేకుండానే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని 13 అనుబంధ గ్రామాల్లో గతంలో కుంటపడ్డ పనులు జీవో ద్వారా వేగంగాసాగుతున్నాయి. జనాభా ప్రతిపాదికన ఆర్థిక సంఘం ఎస్ఎఫ్సీ నిధులు అందజేస్తోంది. కొత్త జీవో విడుదలతో పల్లెల్లో పనులు వేగంగా జరగడంతో ప్రజలు, సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో డీఎల్పీవోల ద్వారా డీపీవో, కలెక్టర్ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపించే వారు. రూ.లక్షలోపు నిధులు జిల్లా పంచాయతీ అధికారికి, రూ.3 లక్షలపైన ఖర్చుల ఆమోదం కోసం కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా అవసరమయ్యేది. దీంతో పల్లెల్లో అత్యవసర పనులు జాప్యం జరిగేది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 91 ద్వారా పల్లెల్లో అత్యవసర పనులను గ్రామ సభల ద్వారా తీర్మానం చేసుకొని వెంటనే చేపట్టవచ్చును.
ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవో 91 ప్రకారం గ్రామాల్లో పనులను వెంటనే చేపట్టవచ్చు. గ్రామాల్లో పనులు గుర్తించి గ్రామసభ ద్వారా తీర్మానం చేసి ఆమోదం పొందిన వెంటనే నేరుగా నిధులను ఖర్చు చేసుకోవచ్చు. ఉన్నతాధికారుల అనుమతులు అవసరం లేదు. దీని ప్రకారం గ్రామంలో నీటిఎద్దడి, పల్లె ప్రగతి పనులు, మురుగు కాల్వల నిర్మాణాలు, రోడ్లకు మరమ్మతు పనులకు వెసులుబాటు కల్పించారు.
ప్రభుత్వం ఇటీవట జీవో నంబర్ 91ని జారీ చేయడం వల్ల పల్లె ప్రజలకు, సర్పంచ్లకు ఎంతగానో ఊరట లభించింది. గతంలో జీపీలో నిధులున్నా వాటిని అత్యవసర పనులకు ఖర్చు చేయడానికి ఎన్నో అడ్డంకులుండేవి. ముందుగా ఉన్నతాధికారులైన డీఎల్పీవో, కలెక్టర్ అనుమతి రావడానికి కూడా చాలా సమయం పట్టేది. ఎవరైనా చిన్న అభ్యంతరం తెలిపినా వాటిని ఉన్నతాధికారులు వెంటనే నిలిపివేసేవారు.
– కందం శంకుతలబాయి సర్పంచ్, సోంపల్లి, మండలం సిరికొండ
ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో ప్రకారం పంచాయతీల్లో పనులు చేపట్టేందుకు గ్రామ సభల ద్వారా ముందుగా ఆమోదం తెలుపుకోవాలి. దాని తర్వాత నేరుగా అభివృద్ధి పనులకు ఎంత నిధులు కావాలో గ్రామస్తులందరి సమక్షంలో తీర్మానించి వెచ్చించుకోవచ్చు. పల్లెల్లో చేపట్టే ఆయా అభివృద్ధి పనులను సర్పంచ్ ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే పంచాయతీ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది.
-కే రమేశ్ ఎంపీవో, ఇచ్చోడ మండలం