చెన్నూర్ టౌన్ : వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. సిద్ధిపేటకు చెందిన అంతర్ జిల్లా నేరస్తుడు అల్లెపు కృష్ణ (47)ను పట్టుకొని పలు కేసులు నమోదుచేశారు. చెన్నూరు( Chennur ) పట్టణంలో మూడు రోజుల క్రితం వృద్ధురాలు జంగం మణెమ్మ మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసు ( Gold Chain) చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ ( ACP Venkateshwar ) తో కలిసి మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్ వివరాలను వెల్లడించారు. మూడు రోజుల క్రితం పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో జంగం మణెమ్మ తన అవసర నిమిత్తం పాత బస్టాండ్ ప్రాంతానికి వెళ్లింది. సిద్దిపేటకు చెందిన అల్లెపు కృష్ణ ఆమెకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. మెడలో ఉన్న గొలుసు ఇవ్వకపోతే చంపుతానని బెదిరించాడు. బలవంతంగా ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు.
అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందంతో గాలిస్తుండగా గురువారం చెన్నూర్ కొత్త బస్టాండ్ ప్రాంతంలో పోలీసులను చూసి నిందితుడు పారిపోతుండగా పట్టుకున్నారు. నేరం ఒప్పుకోవడంతో దొంగిలించిన రెండు తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు తాగుడుకు బానిసై రాష్ట్రంలోని వివిధ పట్టణాలలో దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఇతనిపై ఇప్పటి వరకు వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్ సీఐ రవికుమార్, ఎస్ఐ వెంకటేశ్వర్ రావు, హెచ్ సీలు వి.సంపత్, దేవేందర్, పీసీ ఎన్.జీవన్ లను డీసీపీ సన్మానించారు.