కన్నెపల్లి, మార్చి 18 : ఓ ఏపీఎం మహిళా సంఘాల సభ్యులను మోసం చేసి రూ. 3 లక్షలు కాజేసేందుకు స్కెచ్ వేసి విఫలమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన శ్రీలక్ష్మీ స్వయం సహాయక సంఘం సభ్యులు తమ అవసరాల కోసం స్త్రీనిధి ద్వారా రూ. 7 లక్షల అప్పు ఇవ్వాలని ఏపీఎం అశోక్‌ను కోరారు. ఇందుకు ఆయన ఒప్పుకున్నాడు. ఏడుగురు సభ్యులకు రూ. 7 లక్షలు ఇస్తానని చెప్పి.. వారిని కన్నెపల్లి బ్యాంకుకు పిలిపించాడు. రూ. 7 లక్షలకు బదులు రూ. 10 లక్షలు అప్పుగా చూపించి.. ఇందులో రూ. 3 లక్షలను భీమన్న ఎస్‌హెచ్‌జీ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశాడు. శ్రీలక్ష్మీ ఎస్హెచ్జీకి చెందిన ఓ మహిళా సభ్యురాలి కుమారుడు దీనిని గమనించాడు. వాళ్లకు ఇవ్వాల్సినవి రూ. 7 లక్షలేనని, మీరు మరో రూ. 3 లక్షలు ఇతర గ్రూపు సభ్యులకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాని నిలదీయగా, నీకు ఏం తెలియదంటూ బెదిరించి అక్కడి నుంచి పంపించాడు.
బ్యాంకు నుంచి వీరాపూర్ చేరుకొని ఇతర సభ్యులకు తెలియజేయగా, శ్రీలక్ష్మీ ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఏపీఎం అశోక్‌ను నిలదీశారు. అయినా, వినకపోవడంతో కన్నెపల్లి పోలీసులకు ఫోన్ చేయగా, విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఏపీఎం అప్రమత్తమయ్యాడు. మిగతా డబ్బులు రెండు రోజుల్లో ట్రాన్స్ఫర్ చేస్తానని ఆయన ఒప్పుకోవడంతో సభ్యులు శాంతించారు. కాగా, ఏపీఎం డబ్బులను తన సొంతానికి వాడుకోవాలని అనుకోవడం విస్మయానికి గురి చేస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు అవినీతి ఆరోపణలు రావడంతో, ఇటీవల భీమిని మండలానికి ఆయనను బదిలీ చేశారు. అక్కడ కూడా అవినీతి ఆరోపణలు రావడంతో మంచిర్యాల డీఆర్డీవోకు సరెండర్ చేశారు. అనంతరం కన్నెపల్లిలో పోస్టింగ్ ఇచ్చారు. అయినా ఏపీఎంలో మార్పు రాలేదని పలువురు పేర్కొంటున్నారు. ఏపీఎంతో పాటు ఇక్కడ పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్పైనా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఈ విషయంపై ఏపీఎం అశోక్‌ను వివరణ కోరగా స్పందించడానికి నిరాకరించాడు.