మంచిర్యాల, జూలై 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గెలుపు కోసం గజ్జె కట్టి ఆటఆడి, పాటపాడిన కళాకారులకు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే వివేక్, వివేక్ పీఏ రమణారావు కుచ్చుటోపీ పెట్టడం చర్చనీయాంశం అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గడ్డం వివేక్ పోటీ చేయగా వివేక్ గెలుపు కోసం రెండు కళాబృందాలు ప్రచారం చేశాయి.
ఎర్రటి ఎండను కళాకారులు లెక్కచేయకుండా 16 రోజులపాటు చెన్నూర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించగా రెండు బృందాలకు ఒక్కో బృందానికి రూ.25 వేల చొప్పున రోజుకు రూ.50వేల చొప్పున చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. చెన్నూర్ డివిజన్‌గా ఒక బృందం, మందమర్రి డివిజన్‌గా మరో బృందం రెండు బృందాలుగా పని చేయగా మొత్తం 24 మంది కళాకారులు రేయింబవళ్లు కష్టపడి కళాకారులు వారి ప్రచారాన్ని నిర్వహించారు.
16 రోజులుకు ఒక్కో రోజుకు రూ.50 వేల చొప్పున మొత్తం రూ.8 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. రూ.6.4 లక్షలు చెల్లించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ పీఏలు మిగతా రూ.1.6 లక్షలు కళాకారుల బృందానికి ఇవ్వడానికి మనసు రావడం లేదు. ప్రచార సమయంలో పార్టీ ఆధ్వర్యంలో తిండిపెట్టామని, వసతి కల్పించామని రూ.1.60 లక్షలు ఇవ్వడం కుదరదని వివేక్ ప్రధాన పీఏ రమణారావు చెపుతున్నాడని కళాబృందం టీం ఇన్చార్జి సురేందర్ తెలిపారు.
వివేక్ ఎన్నికలలో గెలిచి ఎనిమిది నెల గడుస్తున్నా తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంపై కళాకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కూలీ కింద వచ్చి గజ్జకట్టి ఆడిపాడితే తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అడిగితే వివేక్ పీఏ రమణారావ్ పట్టించుకోకపోవడమే కాకుండా ఎస్సీలంతా ఇంతే అంటూ అవమానిస్తూ మాట్లాడుతున్నారని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొట్టకూటి కోసం పనిచేసి మాకు రావాల్సిన డబ్బులు అడిగితే పీఏ రమణా రావ్ అధికారంలో ఉంది మేమే నని, ఎవరికి చెప్పినా, ఏ మీడియాలో వచ్చినా మాకు ఒరిగేదేమి లేదని అహంకారంగా మాట్లాడుతున్నాడని కళాకారులు తమ గోడును ‘నమస్తే తెలంగాణ’ ముందు వెల్లబోసుకున్నారు. దళితుల దగ్గర పీఏగా పనిచేప్తున్న రమణారావు దళితులపై అహంకారపూరితంగా మాట్లాడుతున్న అతన్ని కొనసాగిస్తూ ముందుకు సాగడం వల్ల ఎమ్మెల్యే వివేక్ ఆంతర్యమేమిటో అని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు.
ఎమ్మెల్యే న్యాయం చేయాలి..
– సురేందర్, కళాబృందం టీం ఇన్చార్జి.
చెన్నూర్ ఎమ్మెల్యేగా వివేక్ గెలుపు కోసం రాత్రి పగలు తేడా లేకుండా ఆడిపాడిన మాకు చెల్లించాల్సిన డబ్బులు మాకు చెల్లించి మా బృందానికి న్యాయం చేయాలి. పొట్టకూటి కోసం కళాకారులుగా ఆడిపాడిన తమకు సకాలంలో డబ్బులు చెల్లించాల్సింది పోయి వివేక్ సార్ పీఏ రమణారావ్ మా దళితులను చిన్నచూపు చూస్తూ అవమానించేలా మాట్లాడుతున్నాడు. డబ్బు, అధికారం ఉందని అవమానిస్తున్నావు. మా కళాకారుల కడుపు కొట్టాలని చూస్తున్నావు.
రమణారావ్ పని తీరు వల్ల ఇప్పటికే చెన్నూర్ నియోజకవర్గంలో ఎంత నష్టం జరగాలో అంతకన్నా ఎక్కువనే జరిగింది. పీఏతో ముందుకు వెళుతూ, ఆయన మాటలు వింటే రానున్న రోజుల్లో తీవ్ర నష్టం జరగనుంది. ఇప్పటికైనా మా కళాకారులకు జరిగిన అన్యాయంపై దృష్టిసారించి మాకు న్యాయం జరిగేలా చూడాలి. లేదంటే మా కళాకారులతో మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరుతాం.