కాగజ్‌నగర్, జూలై 8 : కాగజ్‌నగర్ పట్టణంలోని పెట్రో ల్ పంపు ఏరియాలోని మహత్మాజ్యోతిబాఫూలే (బాలురు), దరిగాం రోడ్డులోని మహత్మా జ్యోతిబాఫూలే (బాలికలు) విద్యాలయాల్లో నిత్యం ఏదో ఒక ఘటన జరగడం కలకలం రేపుతున్నది. గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తప్పిదమా లేక ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమా.. తెలియదుకాని.. వాటి నిర్వహణ గాడి తప్పి అటు విద్యార్థులు.. ఇటు తల్లిదండ్రు లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఇటీవల ఆ యా చోట్ల పలు ఘటనలు చోటు చేసుకోగా, యంత్రాం గం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది.

Adilabad6
ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు
ఈ నెల 4న రాత్రి దరిగాం రోడ్డులోని బాలికల విద్యాలయంలో తోటి విద్యార్థినులు పదో తరగతి విద్యార్థిని శృతి ముఖానికి గంతలు కట్టి నోట్లో నీరు పోసి పెన్ను క్యాప్ మింగించారు. ఈ విషయాన్ని సదరు విద్యార్థిని ఉపాధ్యాయులకు తెలిపింది. ఆపై వారు ఆమె తండ్రి రమేశ్‌కు సమాచారం అందించగా, ఆయన తన కూతురిని మంచిర్యాలలోని దవాఖానకు తరలించి ఎండోస్కోపీ ద్వారా ఆ క్యాప్‌ను బయటకు తీయించారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, ఈ ఘటనపై వారు విచారణ జరిపారు. దీనికి ముందు అదే విద్యాలయంలో మరో ఘటన చోటు చేసుకోగా, సిబ్బంది బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తపడ్డట్లు వాదనలున్నాయి.
అలాగే పెట్రోల్ పంపు ఏరియాలోని మహత్మాజ్యోతిబాఫూలే బాలుర గురుకుల విద్యాలయంలో ఆరు నెలల క్రితం మరో దాష్టికం జరిగింది. ఓ విద్యార్థి నీరు తాగే బాటిల్లో తోటి విద్యార్థులు యూరిన్ నింపి పెట్టగా, అది తెలియని సదరు విద్యార్థి మూత్రం తాగిన ఘటన కూడా ఉంది. బాలుర గురుకుల విద్యాలయంలో గత విద్యా సంవత్సరంలో కౌటాల మండలానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థికి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాలు విరిగి బాధపడుతుంటే, కనీసం దవాఖానకు తరలించలేదు. ఆ విద్యార్థి తండ్రికి సమాచారమందించగా, రాత్రి 10.30 గంటలకు గురుకుల విద్యాలయానికి చేరుకొని దవాఖానకు తీసుకెళ్లి వైద్యమందించినట్లు తెలిసింది. అంతేగాకుండా ఏడాది క్రితం సైతం ఇదే విద్యాలయానికి చెందిన కొంతమంది విద్యార్థులు రాత్రి 12 గంటల ప్రాంతంలోని గోడదూకి వెళ్లి ఐస్‌క్రీం తిన్న ఘటన సైతం ఉంది.
రాత్రి వేళల్లో విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే వారు బయటకు వెళ్లారు. గతేడాది విద్యా సంవత్సరం చివరలో విద్యార్థుల మధ్య గొడవ జరగడంతో తొమ్మిది మంది విద్యార్థులకు టీసీ ఇచ్చి ఇంటికి పంపించారని సమాచారం. అట్టి విద్యార్థులు గతేడాది తమ ఇంటి నుంచి వచ్చి.. వెళ్తూ పరీక్ష రాసినట్లు తెలిసింది. విద్యాలయాల నిర్వహణ గాడితప్పిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహతామ జ్యోతిబాఫూలే విద్యాలయంలో సీసీ కెమెరాలు సైతం మాయమయ్యాయని తెలిసింది. ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇకనైనా అధికారులు స్పందించి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
చర్యలు శూన్యం
కాగజ్‌నగర్ పట్టణంలోని మహత్మా జ్యోతిబాఫూలే విద్యాలయాల్లో జరుగుతున్న ఘటనలపై అధికారుల చర్యలు శూన్యమని చెప్పవచ్చు. జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం.. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న చర్చ సా గుతున్నది. ఘటనలు జరిగినప్పుడు విధుల్లో ఉ న్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకపోవడాని కి కారణమేంటన్న చర్చ నడుస్తున్నది. ఇటీవల పెన్ను క్యాప్ మింగించిన ఘటనపై మూడు రో జులు విచారణ జరిపినప్పటికీ ఎలాంటి చర్య లు తీసుకోకపోవడం వెనుక మతలబేమిట న్న ప్రశ్న తలెత్తుతున్నది. పైగా విధుల్లో ఉ న్న ఉపాధ్యాయులది ఎలాంటి తప్పిదం లేదని చెప్పడం గమనార్హం.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
కాగజ్‌నగర్ పట్టణంలోని ఎంజేపీ విద్యాలయంలో జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నాము. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాము. బాధిత విద్యార్థి సైతం పెన్ను క్యాప్ మింగించిన వారిని గుర్తించడం లేదు. గురుకుల విద్యాలయంలో విచారణ జరుపుతున్నాము. డిన్నర్ అనంతరం స్టడీ అవర్‌కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న సిబ్బందిది ఎలాంటి తప్పిదం లేదు. త్వరలో అన్ని ఎంజేపీ విద్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము. కాగజ్‌నగర్ పట్టణంలోని మహత్మా జ్యోతిబాఫూలే బాలురు విద్యాలయంలోని సీసీ కెమెరాలు రిపేర్ చేయించి ఏర్పాటు చేస్తాము. – శ్వేత, ఎంజేపీ జిల్లా కో ఆర్డినేటర్, ఆసిఫాబాద్