నిర్మల్: ఇథనాల్ పరిశ్రమ (Ethanol industry) రద్దు డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించింది. రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దిగి వచ్చింది. తక్షణమే పనులు నిలిపివేయాలపి జిల్లా కలెక్టర్ అభినవ్ ( Collector Abhinav) సంబంధిత అధికారులను, పరిశ్రమ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు.
ఇథనాల్ పరిశ్రమ వల్ల తమ పంట భూములు పనికిరాకుండా పోతాయని, గ్రామస్థులు అనారోగ్యం బారిన పడుతారని ఆందోళన వ్యక్తం చేస్తూ నాలుగు గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్నటి నుంచి ప్రారంభించిన మహాధర్నా ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
నిన్న రైతుల వద్దకు చర్చలకు వెళ్లిన ఆర్డీవోను రైతులు నిర్బందించడంతో పాటు వాహనాన్ని దహనం చేయడంతో సమస్య మరింత జఠిలం అయ్యింది. దీంతో కొంతమంది రైతులను పోలీసులు అరెస్టు చేయడంతో బుధవారం జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లురువ్వారు.
పరిస్థితి తీవ్రరూపం దాలుస్తుండడంతో కలెక్టర్ అభినవ్ గ్రామస్థులతో చర్చలు జరిపారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వారికి వివరించారు. పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. అయితే తమకు కలెక్టర్, ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ వస్తేనే ఆందోళనను విరమిస్తామని రైతులు స్పష్టం చేశారు.