నిర్మల్-ఖానాపూర్ జాతీయ రహదారి 61 విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రహదారికి ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలను కాపాడేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. కనకాపూర్ నుంచి ఖానాపూర్ వరకు చేపడుతున్న రోడ్డు పనులకు గాను అటవీ ప్రాంతంలో 1330, రెవెన్యూ ప్రాంతంలో 2611 చెట్లను తీసివేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 380 భారీ వృక్షాలను స్థల మార్పిడి చేశారు. ఇందులో భాగంగా మండలంలోని ఇక్బాల్‌పూర్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెట్లను వేర్లతో సహా తొలగించి క్రేన్ సాయంతో ఇతర ప్రాంతానికి తరలిస్తున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ట్రాన్స్‌లొకేషన్ ద్వారా ఇక్కడి చెట్లను వేరే ప్రాంతాల్లో నాటుతామని ఖానాపూర్ ఎఫ్‌డీవో కోటేశ్వర్రావు పేర్కొన్నారు. రావి, వేప, నెమలినార, టేకు తదితర భారీ వృక్షాలను ఇతర ప్రాంతాల్లో నాటగా.. అన్ని రకాల వృక్షాలు బతికి ఉన్నట్లు ఆయన చెప్పారు.
– ఖానాపూర్ టౌన్, జూన్ 26