భీమారం, ఏప్రిల్ 10 : కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రైతాంగానికి శాపంగా మారింది. గొల్లవాగు ప్రాజెక్టు తూములోని రెండు షటర్లు శిథిలమైపోగా, సకాలంలో మరమ్మతులు చేయక నీరంతా వృథాగా పోయింది. ప్రస్తుతం ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీకి చేరుకుంటుండగా, చివరి వరకూ పంటలకు నీరందుతుందో లేదోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.

భారీగా తగ్గిన నీటిమట్టం
వానకాలంలో భీమారంలోని గొల్లవాగు ప్రాజెక్టు తూములోని రెండు షటర్లు పాడైపోయాయి. ఇందు లో ఓ షటర్ విరిగిపోగా, మరో షటర్ మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, లీకేజీని అరికట్టేందుకు వరదకు అడ్డుగా ఎండు గడ్డితో పాటు ఇసుక బస్తాలు వేశారు. అయినా.. వరద ఆగలేదు. ప్రాజెక్ట్ నుంచి వరద లీకై నీటి మట్టం భారీగా తగ్గింది. డిసెంబర్ 2న ఒక షటర్‌కు తాత్కాలిక మరమ్మతులు (వెల్డింగ్) చేశారు.
అప్పటికే నీ రంతా వృథాగా పోయింది. ప్రస్తుతం ఎండలు ముదరడంతో ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీకి చేరింది. 0.5 టీఎంసీల నీరు ఉండాల్సి ఉండగా, 0.07కు టీఎంసీల నీరు ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఇప్పటికైనా కొత్తగా రెండు షటర్లు ఏర్పాటు చేయాలని, లేదంటే వచ్చే వానకాలంలోనూ నీరంతా వృథా అయ్యే అవకాశముందని రైతులు చెబుతున్నారు.

చి‘వరి’ వరకూ నీరందేనా..
గొల్లవాగు ప్రాజెక్టు ప్రధాన కాలువతో పాటు 39 డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా భీమారం మండలంలోని కొత్తపల్లి, మద్దికల్, ఎల్కేశ్వరం, ఆరెపల్లి, చెన్నూర్ మండలంలోని గంగారాం, ఓత్కులపల్లి, ఆస్నాద్, అంగ్రాజ్‌పల్లి, దుగ్నేపల్లి, చెల్లయ్యపేట, రాజీపేట్, కొమ్మెర, ఎర్రగుంటపల్లి గ్రామాల్లోని (సుమారు 26 కిలోమీటర్ల దూరం వరకు కాలువలు ఉన్నాయి) 9500 ఎకరాలకు సాగు నీరందించాలి. కానీ, ఆయా గ్రామాల్లో ఈ యేడాది 8000 ఎకరాలు సాగు చేసినట్లు తెలుస్తున్నది.
ప్రస్తుతం ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీకి చేరుకున్నది. మరో నెలలోగా పంటలు చేతికందనుండగా, చివరి వరకూ సాగు నీరందుతుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక భీమారం మండల రైతులు పూర్తిగా గొల్లవాగు ప్రాజెక్ట్ మీద ఆధారపడి సాగు చేస్తుంటారు. అర్కపల్లి శివారులో 200 ఎకరాల్లో పంటలు సాగవుతున్నా యి. గొల్లవాగు ప్రాజెక్ట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఇక్కడి పొలాలకు నీరందక ఎండిపోతున్నాయి. ఇప్పటికే 100 ఎకరాలు వరకు ఎండిపోయినట్లు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా గొల్లవాగు ప్రాజెక్ట్ కాలువ ద్వారా అర్కపల్లి చెరువును నింపాలని, అలా చేస్తే కనీసం ఉన్న పంటలనైనా కాపాడుకోవచ్చని రైతులు చెబుతున్నారు. ఇకనైనా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వా, అధికారులు చొరవ తీసుకొని తమ గోస తీర్చాలని వారు వేడుకుంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే సాగు నీటికి ఇబ్బందులు
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలగూర రాజ్‌కుమార్

భీమారం, ఏప్రిల్ 10 : గొల్లవాగు ప్రాజెక్టుపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రైతులు సాగు నీటికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలగూర రాజ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం భీమారం మండల కేంద్రంలోని గొల్లవాగు ప్రాజెక్టును నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గొల్లవాగు ప్రాజెక్టు తూములో ఉన్న షటర్లు తుప్పు పట్టి పోయాయని, వానకాలంలో ప్రాజెక్టులోని నీరంతా వృథాగా పోయిందన్నారు.
సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీకి చేరిందని తెలిపారు. కట్టపై నుంచి పొలాలకు వెళ్లేందుకు ఉన్న సర్వీస్ రోడ్డును అధికారులు తీసివేశారని, వెంటనే రోడ్డు ఏర్పాటు చేయలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్‌లో రూ. 100 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని, కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యే వివేక్ కక్ష్య సాధింపుతో దాని ఊసే ఎత్తడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కలగూర రమేశ్, రాజన్న, వడ్ల కొండ పవన్, సుందిల్ల మల్లేశ్, యువ నాయకులు దాసరి మణిదీపక్, భూక్య రాజేశ్‌నాయక్ పాల్గొన్నారు.
ప్రతిపాదనలు పంపాం
గొల్లవాగు ప్రాజెక్టు షటర్ల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. రైతులకు చివరి వరకు సాగు నీరు అందుతుంది. గొల్లవాగు ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరలేదు. వచ్చే నెలలో డెడ్ స్టోరేజ్‌కి వచ్చే అవకాశాలు ఉంటాయి. జూన్‌లో వర్షాలు పడితే యథావిధిగా వరద వచ్చి చేరుతుంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 8 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది.
– అఖిల, ఇరిగేషన్ ఏఈ
చెరువు నింపాలి
గొల్లవాగు ప్రాజెక్టు మా ఊరికి కూత వేటు దూరంలోనే ఉంటుంది. కానీ సాగు నీరు రావడం లేదు. 100 ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అధికారులు, పాలకులు చొరవ తీసుకొని సాగు నీరు వచ్చేలా చూడాలి. మా ఊరి శివారు ప్రాంతంలోని చెరువు నింపితే ఉన్న పంటలనైనా కాపాడుకోవచ్చు.
– గాలిపెల్లి నాగభూషన్,రైతు, అర్కపల్లి