ముథోల్, ఆగస్టు 10 : ముద్గల్ గ్రామంలో గల రెండు రైస్ మిల్లులపై కేసు నమోదు చేసినట్లు ముథోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. ముద్గల్ గ్రామ సమీపాన గల ఏషియన్ రైస్ మిల్లు యజమాని మషరోద్దీన్ 2024-25 సంవత్సరానికి ఖరీఫ్, రబీలో సేకరించిన 4411.917 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వాల్సి ఉండగా.. ఇవ్వలేదు.
అలాగే గణపతి రైస్ మిల్లు యజమాని చింత శ్రీనివాస్ 2024-25 ఖరీఫ్, రబీలో 2699.531 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బియ్యంగా మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వలేదు. దీంతో సివిల్ సప్లయ్ అధికారులు రైస్ మిల్లులను తనిఖీ చేసి అక్కడ బియ్యం నిల్వలు లేకపోవడంతో ఈ నెల 8వ తేదీన ముథోల్ పోలీస్స్టేషన్లో సివిల్ సప్లయ్ డీఎం సుధాకర్ ఫిర్యాదు చేశారు. దీంతో రైస్ మిల్ యజమానులపై సెక్షన్ 316 (2) , 316 (5), 318 (4) బీఎన్ఎస్తోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. సివిల్ సప్లయ్ డీఎం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.