కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ కాగజ్నగర్, జూన్ 19 : కాగజ్నగర్ పట్టంలోని విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి. రాజకీయ అండదండలున్న కొందరు నాలాల వెంబడి ఉన్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడంతో పాటు మురుగు కాలువలను సైతం పూడ్చేసి నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ప్రధాన కాలువ కాగజ్నగర్ పట్టణంలో నుంచి రైల్వే ట్రాక్ వరకు వెళ్తుంది. వివిధ కాలనీల్లోని మురుగు నీటి కాలువలను ఈ ప్రధాన కాలువకు అనుసంధానం చేశారు. సుమారు 30 అడుగుల వెడల్పుగల ఈ ప్రధాన కాలువ పొడవునా ఇరువైపులా ఆక్రమించడంతో ప్రస్తుతం.. అది 10 అడుగులకు తగ్గింది. ఎన్టీఆర్ చౌరస్తా మొదలుకొని.. ఇండస్ట్రియల్ ఏరియా, కాగజ్నర్ సీహెచ్సీ సమీపంలో, పక్కన ఉన్న ఫంక్షన్ హాల్ వరకూ ప్రధాన కాలువకు ఇరువైపులా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు.
అధికారులు-నాయకుల ప్రమేయం!
కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ స్థలాలు, మురుగు కాలువల కబ్జాల వెనుక అధికారులతో పాటు నాయకుల ప్రమేయమున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పట్టణంలోని ప్రధాన కాలువ ఆక్రమణకు గురికాగా విస్తీర్ణం తగ్గిపోయింది. యేటా వర్షాకాలంలో వరద వెళ్లలేక ఇండ్లలోకి చేరుతున్నది. ప్రతిసారీ ద్వారకానగర్, సంజీవయ్య కాలనీ, నౌగం బస్తీ తదితర కాలనీలు జలమయమయ్యాయి. యేటా వానకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలాలు కబ్జాలకు గురవుతున్నా.. వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
మిగతా ఆక్రమణల సంగతేమిటి..
కాగజ్నగర్ పట్టణంలోని విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురైనా.. నాలాలు స్వాహా చేసినా ఇంతకాలం చూసీచూడనట్లు వ్యవహరించిన మున్సిపల్ అధికారులు గురువారం ఓ అక్రమ నిర్మాణాన్ని కూల్చేశారు. పట్టణంలోని వీఐపీ పాఠశాల నాలపై చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా సర్వే చేసి.. కూలగొట్టామని కాగజ్నగర్ టౌన్ప్లానర్ యశ్వంత్ తెలిపారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ప్రధాన నాలా ఇండస్ట్రియల్ ఏరియా, కాగజ్నర్ సీహెచ్సీ సమీపంలో, పక్కన ఉన్న ఫంక్షన్ హాల్ వరకు ఆక్రమణల్లోనే ఉంది. నాలా ప్రారంభం నుంచి చివరి వరకూ ఆక్రమించి పక్కా నిర్మాణాలు చేపట్టారు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఆక్రమణలన్నింటినీ తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు
కాగజ్నగర్ పట్టణంలో చాలా చోట్ల ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురయ్యాయి. పట్టంలోని సంజీవయ్య కాలనీ నాలాను కబ్జా చేశారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ద్వారకానగర్ కాలనీలో ధోభీఘాట్ సైతం కబ్జాకు గురైంది. పట్టణంలోని నాలాలను కబ్జా చేయడం వల్ల విస్తీర్ణం తగ్గి వర్షాకాలంలో వరద వెళ్లడం లేదు. ఇండ్లలోకి వచ్చి చేరుతున్నది. ఇకనైనా అధికారులు స్పందించాలి.
– నక్క మనోహర్, మాజీ కౌన్సిలర్, కాగజ్నగర్ మున్సిపాలిటీ
కబ్జా చేసినట్లు తేలితే తప్పనిసరిగా తొలగిస్తాం
కాగజ్నగర్ పట్టణంలో అన్ని ప్రభుత్వ స్థలాలను రెవెన్యూ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నాం. ఎక్కడైనా ప్రభుత్వ స్థలంకానీ, నాలాలు కానీ ఆక్రమించినట్లు తేలితే తప్పనిసరిగా తొలగిస్తాం. కబ్జాలపై మాకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. మేము చేపట్టిన సర్వేలో వీఐపీ స్కూల్ యాజమాన్యం నాలాను కబ్జాచేసి కట్టినట్లు తేలింది. అందుకే గురువారం కూల్చేశాం. నాలా మొత్తం సర్వే చేస్తున్నాం. కబ్జాల నుంచి కాలువను కాపాడుతాం.
-అంజయ్య, మున్సిపల్ కమిషనర్, కాగజ్నగర్