తాంసి(భీంపూర్) : మొదటి వర్షాలే గొల్లఘాట్ (Gollaghat) గ్రామస్థులకు కష్టాల్ని తెచ్చిపెట్టాయి. మండలంలోని ఈ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి తొలి వర్షం పడగానే పూర్తిగా బురద (Mud troubles) మయమై రాకపోకలకు ఆటంకాలుగా మారాయి. ఈ గ్రామానికి రోడ్డు లేక ఆర్టీసీ బస్సును ఎరగవు. ఇప్పటివరకు ఆటోలు, ద్విచక్ర వాహనాలే ప్రధాన రవాణా మార్గం. కానీ వర్షాల నేపథ్యంలో ఆ ఆటోలు కూడా రావడం లేదని వాపోతున్నారు.
ద్విచక్రవాహనదారులు పడుతూ.. లేస్తూ, దారికి తగిలే రాళ్లు, రప్పల వల్ల గాయాలపాలు అవుతున్నారు . ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులు, గర్భిణులు మరింత కష్టాల పాలవుతున్నారు. సంబంధిత అధికారులకు రోడ్డు సమస్యను విన్నవించినా, వినతులు అందచేసినా పరిష్కారానికి మాత్రం చొరవచూపడం లేదు. వర్షాకాలం రాగానే ప్రతి సంవత్సరం ఇలాగే కష్టాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లోనూ ఈ దారి ఇబ్బందిగానే ఉంటుంది.
వర్షం కురిస్తే మాత్రం బురదలో కాళ్లు కదలడం కూడా కష్టమవుతుంది. పెద్ద పెద్ద వాహనాలు రాకపోవడంతో బయటకు వెళ్లే అవకాశం లేక ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తుందని గ్రామస్థులు వాపోతున్నారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటిన కనీసం గ్రామానికి బీటీ రోడ్డు లేదని వాపోతున్నారు. వెంటనే గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించి గ్రామస్థుల చిరకాల వాంఛ తీర్చాలని కోరుతున్నారు.