కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఆసిఫాబాద్ డివిజన్లోని వాంకిడి, కెరమెరి, జైనూర్, తిర్యాణి అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి ఒక్కటేనా.. లేక రెండా.. అన్న అంశంపై అధికారులు స్పష్టతకు రాలేకపోతున్నారు. ఇటీవల జైనూర్ మండలం పానపటార్లోని అటవీ సమీపంలోగల వ్యవసాయ క్షేత్రాల్లో రైతులకు ఓ పులి కనిపించింది. వారం క్రితం జైనూర్‌లో ఓ ఆవుపై దాడి చేసింది. ఆ తర్వాత ఉట్నూర్‌లోని చాందూరి, ఎక్స్‌రోడ్ ప్రాంతంలో పులి సంచారం కనిపించింది. కెరమెరిలోని జోడేఘాట్ ప్రాంతంలోనూ పులి సంచరించినట్లు అటవీ అధికారులు గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారు. దీనిని బట్టి ఏజెన్సీలో అడవుల్లో సంచరిస్తున్నది ఒక్కటా.. లేక రెండు పులులా అనేది తెలియడం లేదు. అధికారులు ట్రాకర్స్ సాయంతో గుర్తిస్తేనే స్పష్టమవుతుంది. ఆదివారం వాంకిడి మండలం డాబా- కోర్ డోబ్రా అటవీ ప్రాంతంలో పశువుల మందపై పులి దాడి చేసిన ఘటనతో బండకస, దాబా, సవాతి, అంతపూర్, గోండగ్రాం గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఎప్పుడు ఏ వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని గజగజ వణికిపోతున్నారు.
ట్రాకర్లకు తెలియని జాడ…
పులి మహారాష్ట్ర వెళ్లిపోయిందని ప్రకటించిన రెండు రోజులకే వాంకిడి మండలంలోని కోర్డోబ్రా అటవీ ప్రాంతంలో పశువుల మందపై పంజా విసిరి ఐదు పశువులను గాయపరచడం కలకలం రేపుతున్నది. ఈ ఘటనతో అప్రమత్తమైన అటవీ అధికారులు, ట్రాకర్లు సోమవారం పులి దాడిచేసిన ప్రదేశాన్ని సందర్శించారు. పులి ఎటువెళ్లిందనేది గుర్తించలేకపోయారు. ఈ ప్రాంతం పూర్తిగా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. అది మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పులిదాడి ఘటనలు జరిగినప్పుడే అధికారులు హడావుడి చేసి.. ఆపై పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహారాష్ట్ర వెళ్లిపోయి ఉండవచ్చు..
– సరోజ, డిప్యూటీ రేంజర్
వాంకిడిలో కోర్ డోబ్రా అటవీ ప్రాంతంలో పశువులపై డాడి చేసిన పులి మహారాష్ట్ర వెళ్లిపోయి ఉండవచ్చు. ఘటన జరిగిన అటవీ ప్రాంతాన్ని ట్రాకర్స్‌తో వెళ్లి పరిశీలించాం. పులి సంచారాన్ని గుర్తించేందుకు నాలుగు కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
గోయగాం అటవీ ప్రాంతంలో పులి
వాంకిడి,నవంబర్ 25 : మండలంలోని సరిహద్దు గ్రామమైన గోయగాం అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం పులి కనిపించింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కొందరు యువకులు సెల్ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ట్రాకింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఆదివారం దాబా అటవీ ప్రాంతంలో పశువుల మందపై దాడి చేసిన పెద్దపులే ఈ ప్రాంతంలోకి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.