ఆదిలాబాద్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా రైతులకు వానకాలం సాగు కలిసొచ్చినట్లు కనపించడం లేదు. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోగా.. చేతికొచ్చిన దిగుబడులు అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. పత్తి రైతులు పంటను క్వింటాలుకు మ ద్దతు ధర రూ.8110తో విక్రయించాలంటే.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నిబంధనలు శాపంగా మారాయి. ప్రైవేటులో వ్యాపారులు తక్కువ ధరతో కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉం దని సీసీఐ పంటను కొనుగోలు చేయడం లేదు. వచ్చిన కొద్ది పంటను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి నష్టపోకుండా.. సీసీఐకి అమ్మడానికి మార్కెట్ యార్డులో ఎండబెడుతున్నారు. కాపలాగా రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. సీసీఐ నిబంధనల మేరకు తేమ శాతం వచ్చిన తర్వాత విక్రయిస్తున్నారు.
పత్తి కొనుగోళ్లలో సీసీఐ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా జిన్నింగ్ యజమానులు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం నుంచి జిన్నింగ్లను మూసివేయనున్నారు. బుధవారం మార్కెట్కు సెలవు కా గా.. నేటి నుంచి పత్తి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. ఆదిలాబాద్ జిల్లా లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించిన సీసీఐ 33 జిన్నింగ్ మిల్లులను లీజుకు తీసుకున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 18జిన్నింగ్ మిల్లులు ఉన్నా యి. సీసీఐ రైతుల వద్ద నుంచి సేకరించిన పత్తిని జిన్నింగ్లో ప్రాసెసింగ్ చేసి బేళ్లుగా తయారు చేస్తారు. ఇందుకు సీసీఐ ప్రతి బే ల్కు రూ.1440 చొప్పున చెల్లిస్తున్నది. కపా స్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానంలో పత్తి కొనుగోళ్లు జరుపుతున్న సీసీఐ యాప్లో కొన్ని జిన్నింగ్ మిల్లులను మాత్రమే అందుబాటులోకి ఉంచింది. 18 మిల్లులు లీజు కు తీసుకోగా.. మూడు మిల్లులకు మాత్రమే పత్తి ని ప్రాసెసింగ్ చేయడానికి పంపిస్తుండగా మిగతా జిన్నింగ్ యజమానులు నష్టపోతున్నారు. సీసీఐ తమ జిన్నింగ్ మిల్లులను లీజుకు తీసుకున్నా.. పత్తి రాకపోవడంతో నష్టపోతున్నామని.. విద్యుత్, కూలీ లు, ఇతర చార్జీలు తమకు భారంగా మారుతున్నాయ ని ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ కాటన్ జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు జి న్నింగ్ మిల్లులను మూసి వేస్తున్నట్లు వారు తెలిపారు. జి న్నింగ్ యజమానుల ఆందోళన కారణంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. దీంతో పత్తి కొనుగోళ్లలో రైతులు మరిన్ని ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకున్నది.