ఆదిలాబాద్, నవంబర్ 9(నమస్తే తెలంగాణ) ; ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో అధిక వర్షాల కారణంగా పంటలు నష్టపోగా, యాసంగి సాగు ముందుకు సాగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. వాన కాలంలో భారీగా వర్షాలు కురవడంతో సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు నిండు కుండలుగా మారాయి. సాధా రణ వర్షపాతం 1070.4 మిల్లీ మీటర్లు కాగా 1493.6 మిల్లీ మీటర్లుగా నమోదైంది. వానకా లం నష్టాన్ని యాసం గిలో పూడ్చుకుందామని ఆశించిన రైతులకు నిరాశ తప్పడం లేదు. పత్తి, సోయాబిన్ అమ్మకాలు జరుగుతుండగా.. సీసీఐ, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధరతో రెండు పంటలు కొనుగోలు చేస్తున్నది.
అమ్మకాల్లో ఇబ్బందులు
ఈ ఏడాది రైతులు పండించిన పత్తి క్వింటాలుకు రూ.8110, సోయాబిన్ క్వింటాలుకు రూ.5328 గా ప్రభుత్వం ప్రకటించింది. వచ్చిన కొద్ది పంటను మద్దతు ధరతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముదామని ఆశతో వచ్చిన రైతులకు నిరాశ తప్పడం లేదు. పంటలో తేమ శాతం ఎక్కువ ఉందని సీసీఐ పత్తిని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నది. కపాస్ కిసాన్ యాప్లో ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే సీసీఐకి విక్రయించుకొనే అవకాశం ఉంది. సోయాబిన్ అమ్మకంలో తేమ సమస్యలు ఉండగా.. ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటున్నారు. దీంతో రైతులు మిగతా పంటను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకోవాల్సి వస్తున్నది. ప్రైవేటులో పత్తి క్వింటాలుకు రూ.6800, సోయాబిన్ రూ.4300 వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ పంట కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల కారణంగా రైతులు అమ్ముకోలేక, ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి నష్టపోతున్నారు.
పెట్టుబడుల కోసం తిప్పలు
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం రైతులకు వరంగా మారింది. ఏటా రెండు సీజన్లకు ముందుగానే పంట పెట్టుబడి డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేవి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట ఈ పథకం అమలు చేస్తుండగా.. రైతులకు పెట్టబడి సాయం అందడం లేదు. దీంతో ఈ సీజన్లో రైతు భరోసా అందుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రైతులు అప్పులు చేసి సాగు చేయాల్సి వస్తున్నది. దళారుల వద్ద వానకాలం సాగుకు తీసుకున్న అప్పులు రైతులు చెల్లంచలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో 1.90 లక్షల ఎకరాల్లో రైతులు యాసంగి సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. పత్తి, సోయాబిన్, మక్క పంటలు చేతికి రాగా.. రెండో పంటగా జొన్న, శనగ, గోధుమ, పల్లి వేస్తారు. పంట నష్టంతోపాటు పత్తి, సోయాబిన్ అమ్మకాల్లో ఇబ్బందుల కారణంగా యాసంగి పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నారు.
మంత్రి హామీ ఇచ్చినా అందని పరిహారం
ఆగస్టులో భారీ వర్షాల కారణంగా 20,548 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించారు. పత్తి 15,103 ఎకరాలు, సోయాబిన్ 2900, కంది 1845, మొక్కజొన్న 660, ఇతర పంటలు 100 ఎకరాల్లో నష్టపోయినట్లు నివేదికలు తయారు చేశారు. ఆగస్టు 19న జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. అధికారులతో సమావేశం నిర్వహించి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. మంత్రి ప్రకటనతో కొంతమేర ఊరట లభిస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. మంత్రి పర్యటించి దాదాపు రెండున్నర నెలలు గడుస్తున్నా ఇంతవరకు రైతులకు ఎలాంటి పరిహారం అందలేదు.
అప్పులు పుట్టడం లేదు..
ఈ ఏడాది వర్షాలతో భారీగా రైతులు పంటలు నష్టపోవాల్సి వచ్చింది. యాసంగిలో నష్టాన్ని కొంతవరకు పూడ్చుకుందామని ఆశతో జొన్న, శనగ సాగు చేద్దామనుకుంటే అప్పులు పుట్టడం లేదు. చాలా మంది రైతుల పంటలు అమ్ముడుపోక చేతిలో పైసలు లేవు. ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందో? లేదో? అనే అనుమానాలు ఉన్నాయి. చెరువుల్లో నీళ్లు బాగా ఉండడం, భూమిలో తేమ ఉంది. దీంతో యాసంగి పంటలు బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చేతిలో పైసలు లేకపోవడంతో సాగు చేస్తామా? వద్దా? అనే డైలామాలో ఉన్నాం.
– వెంకట్ రెడ్డి, రైతు, కజ్జర్ల(తలమడుగు మండలం)