Telangana | మంచిర్యాల, నవంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చే వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. నిన్న, మొన్నటి వరకు మంచిర్యాల నుంచి మంత్రి అవ్వడానికి పోటీ పడుతున్న ఎమ్మెల్యేలను కాదని పక్కా జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకు పదవి ఇస్తారని ఆ పార్టీ నాయకులే చెప్పుకొచ్చారు. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కొత్తవాదన తెరపైకి వచ్చింది. మంచిర్యాల జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో బాగా డబ్బులున్న ఓ ఎమ్మెల్యే మహారాష్ట్ర ఎన్నికల కోసం వందల కోట్లు దారాదత్తం చేస్తున్నారట. ప్రతి ఫలంగా ఆయన మంత్రి పదవి కోసం పట్టుపడుతున్నారని మరో ఎమ్మెల్యే వర్గం నాయకులు ప్రచారం చేస్తున్నారు.
‘మా సార్‌కు పైసలు లేవు. పార్టీ కోసం కష్టపడ్డాడు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిండు. న్యాయంగా చూసుకుంటే మా ఎమ్మెల్యేకు తప్ప మరొకరికి మంత్రి పదవి ఇవ్వొద్దు. కానీ.. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చి బాగా డబ్బున్న ఎమ్మెల్యే పదవి కోసం కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మా సార్‌కు పదవి రాకపోతే ఏం చేసుడో అర్థమైతలేదు’ అని ఆ నాయకులు వాపోతున్నారు. అందుకే మహారాష్ట్రలో ఎన్నికలైతే మన జిల్లాలో హడావుడి కనిపిస్తుందన్నారు. అన్ని వాహనాలు, అంత మందిని ఎన్నికల కోసం తీసుకుపోతున్నారంటే.. దానికి కారణం ఆ నోట్ల కట్టలు కట్టే ఎమ్మెల్యే హస్తం ఉందని మరో ఎమ్మెల్యే అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది.
ఓ మంత్రి ప్రచారం చేస్తే నియోజకవర్గాల్లో ఖర్చు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఓ మంత్రి స్టార్ క్యాంపెనయిర్‌గా ఉండి ప్రచారం చేస్తున్న నియోజకవర్గాల్లో సదరు ఎమ్మెల్యే ఇస్తున్న డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు కాంగ్రెస్ లీడర్లే చెప్తున్నరు. డబ్బులు ఇక్కడి నుంచి తీసుకుపోకుండా మహారాష్ట్రలో తనకున్న పరిశ్రమలు, వ్యాపార సముదాయాల నుంచే ఈ డబ్బులు అప్పగిస్తున్నారని ఆ నాయకులు ఆరోపిస్తున్నరు. ఆ మంత్రి ప్రచారం చేస్తే నియోజకవర్గాల్లో డబ్బు ల పంపిణీ బాధ్యత కూడా సదరు ఎమ్మెల్యేనే తీసుకున్నారని చెప్తున్నరు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఇస్తున్న కోట్ల రూపాయలు, పక్క రాష్ట్రంలో పెడుతున్న ఖర్చు గురించి పార్టీలో ‘ముఖ్య’మైన నాయకుడు అధిష్టా నం దృష్టికి తీసుకువెళ్లడం ఆయనకే మంత్రి పదవి కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారని జిల్లాలోని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు.
పార్టీ కోసం తెలంగాణలో పని చేసిన ఎమ్మెల్యేను కాదని పక్క రాష్ట్రం ఎన్నికల్లో డబ్బులు కుమ్మరించే వారికి పదవి ఇవ్వడం వెనుక మతలబేంటని ప్రశ్నిస్తున్నారు. కాగా.. ఈ విషయం తెలిసిన మా సార్ కూడా వెళ్లి అధిష్టానాన్ని కలిశారని చెప్తున్నారు. డబ్బులున్న బడా లీడర్‌కు మంత్రి పదవి ఇస్తే ఇచ్చుకోండి. పార్టీ కోసం కష్టపడిన నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ స్పష్టంగా చెప్పి వచ్చారట. కాకపోతే ఒకే జి ల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవు లు ఇవ్వడం కుదరదని అధిష్టానం చెప్పినట్లు సమాచారం. అదే జరిగితే ఇన్ని రోజులు జిల్లా కాంగ్రెస్‌లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతాయనడంలో సందేహం లేదు.
ఎటూ తేల్చని అధిష్టానం
మంత్రి పదవి విషయంలో రోజుకో ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతుంటే.. కాంగ్రెస్ అధిష్టానం ఊరించి ఉసూరుమనిపిస్తుందే తప్పా ఎవరు మంత్రి అన్న విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో హస్తం పార్టీ క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు నారాజ్ అవుతున్నరు. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నలిగిపోతున్నరు. మంత్రి పదవి ఆశించి భంగపడుతున్న ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులే ఈ విషయంపై తీవ్రమైన చర్చ లేపుతున్నారు. ఇలా చేస్తేనైనా అధిష్టానం వరకు విషయం వెళ్లి కష్టపడిన వారిని గుర్తిస్తుందో ఏమోనని ఆశపడుతున్నారు. లేకపోతే మంత్రి పదవి విషయంలోనే ఇలా చేసిన పార్టీ రేపు లోకల్ బాడీ ఎన్నికల్లోనూ ఇదే చేస్తే మా పరిస్థితి ఏంటని హైరానా పడుతున్నారు. మంత్రి పదవి ఒకరి దగ్గరుండి, జిల్లా అధ్యక్ష పదవి ఒకరి దగ్గర ఉంటే స్థానిక ఎన్నికల్లో మాకు కష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నరు. ఒకరు టికెట్ ఇస్తే మరొకరు క్యాన్సల్ చేయరని నమ్మకం ఏంటని.. ఈ ఇద్దరి మధ్య మేం నలిగిపోక తప్పదని వాపోతున్నరు. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటుందా. మంత్రి పదవి విషయంలో సాధ్యమైనంత త్వరగా ఏదో ఒకటి తేలుస్తుందా? ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇస్తుందా? లేకపోతే జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోతుంటే చూస్తూ మిన్నకుండి పోతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.