ఆదిలాబాద్ : ప్రతిరోజు ఆటలు ఆడడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉంటారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నెలకొల్పిన పట్టణ, గ్రామీణ క్రీడా మైదానాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ లోని 42వ వార్డు రిక్షా కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ క్రీడా మైదానాన్ని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ లతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. పలువురితో కలిసి ఉత్సాహంగా వాలీబాల్ ఆడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. ప్రజలకు ఆరోగ్య వాతావరణాన్ని కల్పించేందుకు సీఎం కేసీఆర్ పట్టణ, గ్రామీణ క్రీడా మైదానాలు ప్రారంభించాలని ఆదేశించడంతో పట్టణాల్లో రెండు, మండలాల్లో రెండు చొప్పున క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామన్నారు.
యువకులు వీటిని సద్వినియోగం చేసుకొని క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శైలజ, వార్డ్ కౌన్సిలర్ ఆవుల వెంకన్న తో పాటు పలువురు కౌన్సిలర్లు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, పాల్గొన్నారు.