ముథోల్, ఆగస్టు, 9: ‘కువైట్ దేశంలో ఇబ్బంది పడుతున్న నా భర్తను గ్రామానికి తీసుకురావాలి’ అని ముథోల్ మండలంలోని రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ భార్య లక్ష్మి అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకున్నది. ఈ మేరకు శుక్రవారం ముథోల్ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేసింది. ఉపాధి కోసం కువైట్‌కు క్లీనింగ్ పనుల నిమిత్తం ఏజెంట్ డబ్బులు తీసుకొని పంపించాడని తెలిపారు. కానీ అక్కడ ఎడారిలో ఒంటెలను కాసే పనిలో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తన భర్తను ఇండియాకు తీసుకవచ్చేలా చూడాలని కోరింది.
భైంసా, ఆగస్టు 9: కువైట్‌లో ఇబ్బంది పడుతున్న ముథోల్ మండలంలోని రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్‌ను తీసుకువస్తామని ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. నాందేవ్ కుటుంబ సభ్యులు, నాయకులు ఎమ్మెల్యే వద్దకు శుక్రవారం వెళ్లి విన్నవించారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందించి గల్ఫ్ బాధితుడికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి ఈ విషయం తెలిపానని త్వరలో బాధితుడిని తీసుకవచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.