బోథ్, నవంబర్ 28 : బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ల పాలనలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆదరించాలని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ పిలుపునిచ్చారు. మంగళవారం బోథ్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్, ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలను అమలు చేసిందన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే పింఛన్ల పెంపు, బీడీ కార్మికులకు రూ.5 వేల పింఛన్, తెల్ల రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం, గృహలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ.3 వేల ఆర్థిక సాయం, కేసీఆర్ బీమా వంటి పథకాలను అమలు చేస్తుందన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులను బేరీజ్ వేసుకొని ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. తనను గెలిపిస్తే బోథ్‌ను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, జనరల్ డిగ్రీ కళాశాల, అగ్ని మాపక కేంద్రం, మున్సిపాలిటీ ఏర్పాటు చేయిస్తానన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను అసెంబ్లీ పంపించి కేసీఆర్‌ను సీఎం చేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ డీ నారాయణ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రుక్మాణ్‌సింగ్, పీఏసీఎస్ చైర్మన్ ప్రశాంత్, సర్పంచ్‌లు సురేందర్ యాదవ్, బీ శ్రీధర్ రెడ్డి, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలని ఆదిలాబాద్ మాజీ ఎంపీ గొడం నగేశ్ పిలుపునిచ్చారు. మంగళవారం బోథ్‌లో రోడ్ షో అనంతరం స్థానిక బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నది దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుంది అంటుందన్నారు. నీరంతర విద్యుత్‌తో రైతులు తమకు అవసరమైన సమయంలో పంటలకు నీళ్లు అందించుకునే వీలు బీఆర్ఎస్ సర్కార్ కల్పించిందన్నారు.
బీజేపీ నాయకత్వంలోని కేంద్రం ప్రభుత్వం మోటర్ల కాడా మీటర్లు పెట్టకుంటే రూ.25 వేల కోట్లు నిధుల కోత విధించిన, సీఎం కేసీఆర్ భయపడకుండా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో రూ.62 వేల కోట్ల అప్పులు చేసిందన్నారు. బీజేపీ నాయకత్వంలోని ప్రభు త్వం రూ.100 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అప్పులు చేస్తే కాంగ్రెస్, బీజేపీ నాయకులు వారి పాలన తీరు చూసుకోకుండా విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి జాదవ్ అనిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
గుడిహత్నూర్, నవంబర్ 28 : ఆశీర్వదించండి.. కారు గుర్తుకు ఓటు వేసి బోథ్ నియోజకవర్గానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుడిహత్నూర్‌లో మంగళవారం ఆయనకు వ్యాపారస్థులు ఘన స్వాగతం పలికారు. మా మద్దతు మీకే ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంతోషమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందన్నారు. మండల కేంద్రంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తిరుమల్‌గౌడ్, జాదవ్ రమేశ్, జాదవ్ సునీత, ఆడె శీల, సుధాకర్‌రెడ్డి, ఎస్కే జమీల్, ఎండీ గఫార్, తెలెంగే మాధవ్, పాండు, రవీందర్, ఆడె గుణవంత్‌రావ్, తదితరులు పాల్గొన్నారు.