ఆదిలాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం జిల్లాలో పర్యటించిన ఆయన పెన్‌గంగా గెస్ట్‌హౌస్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వరద వల్ల జరిగిన నష్టాన్ని శాఖలవారీగా అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా రైతులు పత్తి, సోయా ఇతర పంటలు నష్టపోయారని, రహదారులు దెబ్బతిన్నాయని, పేదల ఇండ్లకు నష్టం జరిగినట్లు తెలిపారు. శాఖలవారీగా అధికారులు సమగ్ర నివేదికలు తయారు చేసి అందజేయాలని, ముఖ్యమంత్రిని కలిసి వరద నష్టాన్ని వివరిస్తామని పేర్కొన్నారు. నష్టపోయిన పంటకు ఎకరాకు రూ.10 వేల సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలోని శాంతినగర్‌లో కూలిన ఇంటిన పరిశీలించిన మంత్రి ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తంతోలిలో వరదతో నష్టపోయిన పంటను పరిశీలించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ విఠల్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ చైన్‌గేట్, ఆగస్టు 19 : భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భారీ వర్షాలపై మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరదల కారణంగా నీట మునిగిన వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయల పంటలను తక్షణమే సర్వే చేసి నివేదికలను ప్రభుత్వానికి పంపాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్ పాల్గొన్నారు.
కడెం, ఆగస్టు 19 : కలెక్టర్ అభిలాష అభినవవ్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌తో కలిసి ఇన్చార్జి మంత్రి జూపల్లి కడెం ప్రాజెక్టును సందర్శించారు. ఆయన వెంట ఆర్డీవో రత్న కల్యాణి, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, ఈఈ విఠల్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో అరుణ, తదితరులు ఉన్నారు.
వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. నియోజకవ ర్గంలోని 10 మండలాల్లో వరదల కారణంగా రైతులు పత్తి, సోయా, మొక్కజొన్న పంటలు నష్టపోయారని, రహదారులు దెబ్బతిన్నట్లు తెలిపారు. ఇచ్చోడ గిరిజన పాఠశాలలోని వర్షం నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని, బజార్హత్నూర్ మండలం దేగామ ప్రాజెక్టు ముంపు బాధికులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. ఇండ్లు నష్టపోయిన వారికి ఆదుకోవాలని కోరారు.