తాండూర్ : మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ( Mid-day meal workers ) పరిష్కరించాలని కోరుతూ తాండూర్ ఎమ్మార్సీ కార్యాలయ సిబ్బందికి కార్మికులు సమ్మె నోటీసు ( Strike notice ) ను అందజేశారు. సమస్యలపై ఈ నెల 6 న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ధర్నాకు ప్రభుత్వ పాఠశాలలలో మధ్యాహ్న భోజనం వంటలు బంద్ చేసి వెళ్తున్న దృష్ట్యా మధ్యాహ్న భోజన కార్మికులు మంగళవారం సీఐటీయూ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగం రాజారాం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. ఏడు నెలలుగా కోడిగుడ్ల బిల్లులు, వంట బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు.
ప్రభుత్వం గుడ్లకు ఇచ్చే బడ్జెట్‌కు రెండు గుడ్లు కూడా రావు. పైగా మూడు కోడిగుడ్లు పెట్టాలని అధికారులు స్కూల్ సిబ్బంది ఒత్తిడి తెస్తున్నారు. పెట్టిన వాటికే ఏడు నెలల నుండి బిల్లులు పెండింగ్‌లో ఉంటే కార్మికులు ఎంతకాలం అప్పులు చేసి పెడతారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రామగిరి వరలక్ష్మి, అక్కపెళ్లి కమల, ఉరడి సరిత పాల్గొన్నారు.