ఇంద్రవెల్లి, జనవరి 18 : పవిత్ర గంగాజలంతో మంగళవారం రాత్రి కేస్లాపూర్ మర్రిచెట్ల వద్దకు చేరుకున్న మెస్రం వంశీయులు, అక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడే బస చేసి, బుధవారం ఉదయం సంప్రదాయ ప్రత్యేక పూజలు చేశా రు. మహిళలు నైవేద్యాలతో కూడిన వెదురు బుట్టలను వరుసలో ఉంచారు. దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. గ్రామాల నుంచి కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లపై వచ్చిన వంశీయులు, ఇక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. మహిళలు, పురుషులు వేర్వేరుగా కూర్చొని పూజలతో పాటు, చర్చాగోష్టి నిర్వహించారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన పటేళ్లు రాత్రి కెస్లాపూర్ వచ్చినట్లు నాగోబా పేన్ కొత్వాల్ మెస్రం తిరుపతి.. మర్రి చెట్ల వద్ద బసచేస్తున్న మెస్రం వంశీయులకు సమాచారం అందించారు. పీఠాధిపతి మెసం వెంకట్రావ్పటేల్తో పాటు పటేళ్లకు పర్ధాంజీలు మెస్రం దాదారావ్, నాగోబా పేన్ కొత్వాల్ మెస్రం గణపతి, తదితరులు సంప్రదాయం ప్రకారం ఆహ్వానించారు. మర్రి చెట్లవద్ద
పటేల్ గాదితోపాటు కటోడ, గాయికి, ప్రధాన్ గాదిలను ఏర్పాటు చేశారు. అక్కడ పటేళ్లు, పర్ధాంజీలు వేర్వేరుగా కూర్చొని కచేరీ నిర్వహించారు. మహాపూజలతో పాటు, సిరికొండ మండలంలో తయారు చేసిన మట్టి కుండలను తీసుకురావడం, పెద్దల పేరిట నిర్వహించే తుమ్(కర్మకాండలు)పై చర్చించారు. ఈ కార్యక్రమంలో చిన్నుపటేల్, బాజీరావ్పటేల్, లింబారావ్పటేల్, కటోడ కోసు, కోసురావ్ కటోడ, కటోడ హనుమంత్రావ్, నాయికి ధర్ము, తదితరులు పాల్గొన్నారు.
ముమ్మరంగా ఏర్పాట్లు.. నాగోబా ఆలయానికి కొత్త తలుపులు
నాగోబా జాతరను పురస్కరించుకొని ఏర్పాట్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దేవాదాయ, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, పీఆర్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టారు. మర్రిచెట్లు, గోవాడ్ ప్రాంతాల్లో కొత్తగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, తీగలు అమర్చారు. కెస్లాపూర్ నుంచి ముత్నూర్ వరకు బీటీ రోడ్డుకు అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. జాతరలో దుకాణాల ఏర్పాటు కోసం ప్లాటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేపడుతున్నారు. మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో నాగోబా ఆలయానికి కొత్త తలుపులు భిగించారు. ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించి, మార్పులు చేర్పులు చేయిస్తున్నారు.
ఆలయ కమిటీ చైర్మన్ ప్రమాణం..
నాగోబా ఆలయ కమిటీ చైర్మన్గా మెస్రం తుకారాం.., ఈవో రాజమౌళి, మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ సమక్షంలో బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మాట్లాడుతూ.. మెస్రం వంశీయులు తనపై ఉంచిన నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు బాజీరావ్పటేల్, కోసేరావ్ కటోడ, హనుమంత్రావ్ కటోడ, కోసు కటోడ, పర్ధాంజీ దాదారావ్, మెస్రం నాగ్నాథ్, మెస్రం వంశీయులు తదితరులు పాల్గొన్నారు.