ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జరిగిన వరద నష్టాల నివారణకు ( Prevent Measures ) అధికార యంత్రాంగం సమన్వయంతో చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆబ్కారీ మధ్య నిషేధ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) అన్నారు. వరద నష్టాల నివారణకు బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాల వల్ల జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 6 వేల 450 ఎకరాల్లో పత్తి, వరి, ఇతర పంటలకు నష్టం జరిగిందని వెల్లడించారు. సుమారు 3 ,100 మంది రైతులు పంటలను నష్టపోయారని తెలిపారు. పంట నష్టం, పశు నష్టంపై పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించాలని తెలిపారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోని రహదారులు కొంతమేర ధ్వంసం కావడం, అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయిన చోట త్వరగా మరమ్మతులు చేపట్టి రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజానీకం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వారం రోజులుగా కురిసిన భారీ వర్షం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. పంట నష్టం, రహదారులు, వంతెనలు, కల్వర్టుల మరమ్మత్తుల కొరకు అంచనాలు రూపొందించి త్వరగా మరమ్మతులు చేపడతామని వెల్లడించారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని వట్టి వాగు కాలువలకు గండిపడి రైతుల చేనులలో నీరు రావడంతో పత్తి పంట నష్టపోయారని, రైతులను ఆదుకోవాలని కోరారు. అంతకు ముందు ఆసిఫాబాద్ మండలం రాజురా గ్రామానికి వెళ్లే రహదారిలో లెవెల్ వంతెనను మంత్రి పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని కొమురం భీం విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆసిఫాబాద్ మండలం మాలన్ గొంది గ్రామానికి చెందిన సిడాం గంగుకు చెందిన మేకలు వర్షాల కారణంగా మృత్యువాత పడటంతో రూ. 1.50 లక్షల పరిహారం ప్రొసీడింగును బాధితులకు అందజేశారు.
ఈ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, కాగజ్ నగర్ అటవీ డివిజన్ అధికారి సుశాంత్, జి. సి. ఓ. కొట్నాక తిరుపతి, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావు, పంచాయతీ రాజ్ ఈఈ కృష్ణ, రోడ్లు భవనాల శాఖ ఈఈ సురేష్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సురేష్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.