ఇంద్రవెల్లి, ఏప్రిల్ 4 : ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాలున్న భోజనాన్ని అందించాలని అధికారులు, సిబ్బందిని ఐటీడీఏ పీవో ఖుష్భుగుప్తా ఆదేశించారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని బాలికల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఐటీడీఏ పీవో ఖుష్భుగుప్తా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గుడ్లతోపాటు సరుకులు, పోషకాల ఆహారాన్ని పరిశీలించి, వంటగది, స్టోర్ రూం, తాగునీరు, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషకాహారాన్ని అందించాలన్నారు. అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించాలన్నారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులె వరైనా జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా ? లేదా ? అని ఆరాతీశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. పాఠశాలతో పాటు పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు.