కుభీర్ : యువత భవిష్యత్తు నాశనం చేస్తూ , సమాజానికి ప్రమాదకరంగా మారిన గంజాయిని (Marijuana Destroys ) ఉక్కుపాదంతో అణచి వేసేందుకు కృషి చేస్తున్నామని కుభీర్ ఎస్సై శ్రీనివాస్ ( SI Srinivas ) వెల్లడించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో ‘ గంజాయి గస్తీ ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకకాలంలో కుభీర్లోని అన్ని పాన్ షాపులు, పలు దుకాణాలను సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. యువతకు గంజాయి సేవనంతో కలిగే అనర్థాల గురించి వివరించారు.
గంజాయి సమాచారం ఎవరికైనా తెలిసినా పోలీసులకు సమాచారం అందించాలని, తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. గంజాయి బానిసలను రిహాబిలిటేషన్ కేంద్రాల్లో చికిత్స అందించి కౌన్సిలింగ్ ద్వారా మార్పు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎవరైనా గంజాయి సాగు, సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పద్దతి మార్చుకోని గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.