మంచిర్యాల ఏసీసీ, డిసెంబర్ 29 : జేఎన్-1 కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డా. జీ. సుబ్బారాయుడు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 21 నుంచి కరోనా ర్యాపిడ్ పరీక్షలు ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 1022 పరీక్షలు చేశామని, బుధవారం ఒక పాజిటివ్ కేసు నమోదైందని చెప్పారు. జేఏన్-1 కొవిడ్‌పై మాధ్యమాల్లో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.
లక్షణాలున్న వారు పీహెచ్‌సీలకు వెళ్లి ర్యాపిడ్ పరీక్షలు చేసుకోవాలని, ఒకవేళ పాజిటివ్ వస్తే మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలోని ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లో టెస్టు చేయించుకోవాలని సూచించారు. అందులోనూ పాజిటివ్ వస్తే హైదరాబాద్‌లోని జీనోమ్ ల్యాబ్‌కు శాంపిల్ పంపించి నిర్ధారించడం జరుగుతుందన్నారు. తుమ్ములు రావడం, జలుబు, జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లు ఎర్రబడటం, ఒళ్లునొప్పులువంటివి ఉంటే జేఎన్-1 వైరస్ లక్షణాలన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసుకోవాలని సూచించారు. అనంతరం కరోనా జాగ్రత్తలపై వాల్ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరిండెంటెండ్ డా.హరీశ్చంద్రా రెడ్డి, నోడల్ అధికారి డా.ఫయాజ్‌ఖాన్, డెమో బుక్క వెంకటేశ్వర్లు, డీపీఆర్వో సంపత్‌కుమార్ పాల్గొన్నారు.