కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ఆసిఫాబాద్ టౌన్/మంచిర్యాల ఏసీసీ, జూన్ 17: ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపడుతున్నది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేయగా, ఇందులో మంచిర్యాల డీసీపీ అశోక్‌కుమార్‌ను జగిత్యాల ఎస్పీగా, కుమ్రం భీం ఎస్పీ సురేశ్‌కుమార్‌ను బాలానగర్ డీసీపీగా బదిలీ చేసింది. మేడ్చల్ డీసీపీ డీవీ శ్రీనివాస్ రావును ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా నియమించింది.
హైదరాబాద్ ఎస్పీ, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోగా విధులు నిర్వహిస్తున్న ఏ.భాస్కర్‌ను మంచిర్యాల డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 బ్యాచ్‌కు చెందిన అశోక్‌కుమార్ మార్చి 2న మంచిర్యాల డీసీపీగా బాధ్యతలు స్వీకరించారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవల నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించడంలో ఎస్పీ సురేశ్‌కుమార్ సక్సెస్ అయ్యారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు.