మంచిర్యాల అర్బన్, జనవరి 4 : జిల్లా కళాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్హాల్లో బుధ వారం ఏర్పాటు చేసిన జిల్లా యువజనోత్సవ పోటీలను మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేశ్ గౌడ్, డీవైఎస్వో శ్రీకాంత్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లాలో యువజనోత్సవాలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అనంతరం విద్యార్థులు, కళాకారులు పోటాపోటీగా ప్రదర్శనలిచ్చారు.
న్యాయనిర్ణేతలుగా చిదానందకుమారి, జ్యోత్స్న చంద్రదత్, శాంకరీ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ చంద్రమోహన్ గౌడ్, వాగ్దేవి కళాశాల కరస్పాండెంట్ పెట్టం మల్లేశ్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ రాంచందర్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హన్మండ్లు, మధుకర్, జిల్లా నృత్య కళా సమాఖ్య అధ్యక్షుడు రాకం సంతోష్, లక్ష్మణ్, రమేశ్, అర్జున్, సది, రమేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
యువ కళాకారుల ప్రతిభ..
జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో యువ కళాకారులు ప్రతిభ చాటారు. ప్రథమ స్థానంలో మంచిర్యాల మోడల్ స్కూల్ విద్యార్థుల బృందం నిలువగా, ద్వితీయ స్థానంలో బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల బృందం నిలిచింది. విజేతలకు జాతీయ కళాకారుడు, తెలంగాణ ధూంధాం వ్యవస్థాపక అధ్యక్షుడు అంతడుపుల నాగరాజు, డీవైఎస్వో శ్రీకాంత్ రెడ్డి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. వీరు ఈ నెల 9, 10వ తేదీల్లో మహబూబ్నగర్లో జరిగే రాష్ట్ర స్థాయి యువజనోత్సవ పోటీల్లో పాల్గొంటారని డీవైఎస్వో తెలిపారు.