ఉట్నూర్ రూరల్ , ఫిబ్రవరి 2: కవ్వాల్ అభయారణ్యంలోకి(Kawal Sanctuary) రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు స్థానికేతర వాహనాలకు అనుమతి లేదని ఈ విషయాన్ని ప్రజలు సానుకూలంగా అర్థం చేసుకోవాలని ఉట్నూర్ (ఎఫ్ డి పి టి )డివిజన్ ఎఫ్ డి ఓ రేవంత్ చంద్ర తెలిపారు. ఉట్నూరు డివిజన్లోని కొత్తగూడ చెక్ పోస్ట్ నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎట్టి పరిస్థితిలో వాహనాలకు అనుమతి ఇవ్వమన్నారు. రాత్రి సమయాలలో ప్రత్యామ్నాయంగా గుడిహత్నూర్ , జైనూరు గుండా వెళ్లే రహదారులను ఉపయోగించుకోవాలని సూచించారు.
స్థానిక వాహనాలకు మాత్రం అనుమతి ఇస్తామని, ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు చూపితే స్థానికులకు అనుమతి ఉంటుందన్నారు. అదేవిధంగా ఎమర్జెన్సీ వాహనాలకు మినహాయింపు ఉంటుందని, ఇందులో ఆర్టీసీ బస్సులు, అంబులెన్స్ , ఇతర అత్యవసర వాహనాలు వెళ్లడానికి అనుమతి ఇస్తామన్నారు. అలాగే సెస్ చార్జీల పై స్థానికేతర వాహనాలకు మినహాయింపు ఉండదని తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ఈ విషయాన్ని సానుకూలంగా అర్థం చేసుకొని అటవీ అధికారులకు సహకరించాలన్నారు.