దండేపల్లి: ‘వాల్టా’ చట్టం ప్రకారం ప్రజలు తమ పొలాల్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచిన టేకు, వేప, తుమ్మ, జిట్రేగి, దిర్శినం, బిల్లుడు తదితర చెట్లను నరికివేయడానికి అటవీ శాఖ అనుమతి తప్పనిసరని తాళ్లపేట అటవీ క్షేత్రాధికారి సుష్మారావు అన్నారు. తాము పెంచుకున్న చెట్లపై పూర్తి అధికారం ఉందని భావించి, అటవీ శాఖ అనుమతి లేకుండా చెట్లు నరికినా లేదా తరలించినా చర్యలు తప్పవని ఆమె తెలిపారు.
ఎవరైనా తాము చెట్లను తొలగించాలంటే వాల్టా చట్టం ప్రకారం ఆన్లైన్ ద్వారా తమ భూమిలో తొలగించబోయే చెట్ల వివరాలు, సంఖ్య, వాటి వయస్సును నమోదు చేయాలని సుష్మారావు చెప్పారు. ‘ఒక్కో చెట్టుకు రూ.500 చొప్పున అటవీ శాఖ పేరుతో డిపాజిట్ చెయాలి. అన్ని అనుమతులు పొందిన తర్వాతే తొలగించిన కలపను ఎక్కడికైనా తరలించుకోవడానికి అవకాశం ఉంటుంది.
చెట్లు తొలగించిన అనంతరం ఒక చెట్టుకు బదులుగా రెండు చెట్లు నాటి.. వాటిని మూడేళ్ల పాటు సంరక్షించాలి. అలా చేస్తే అటవీ శాఖ పరిశీలన అనంతరం చెల్లించిన అనుమతి డిపాజిట్ మొత్తాన్ని రైతుకు తిరిగి చెల్లిస్తాం.
ఎవరైనా వాల్టా చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తూ.. అనుమతి లేకుండా చెట్లు నరికిన లేదంటే అక్రమంగా కలపను తరలించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటా’మని సుష్మారావు హెచ్చరించారు.