హాజీపూర్, జూన్ 19: మంచిర్యాల (Mancherial) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట బుగ్గట్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో వ్యక్తి మృతిచెందారు. ముల్కల్లకు చెందిన బొలిశెట్టి శ్రీనివాస్ (39) లక్షటిపేటలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. విధులు ముగించుకొని తన బైక్‌పై ఇంటికి బయలు దేరిన శ్రీనివాస్‌ను.. బుగ్గట్టు ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో చెట్ల పొదల్లో పడి అక్కడికక్కడే మృతి చెందారు.
తెల్లవారు జామున గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెట్ల పొదల్లో నుంచి మృత దేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీను మృతితో ముల్కల్ల లో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతివార్త తెలుసుకున్న స్నేహితులు, బంధువులు ప్రభుత్వ దవాఖానకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కాగా మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు అభిరామ్, శ్రీజ లు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.