కాసిపేట, నవంబర్ 26 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం భరత్ కాలనీలో బుధవారం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేపట్టింది. తనను పెళ్లి చేసుకునే వరకు ఇంటి ముందు నుంచి కదలనని ఆందోళన చేపట్టింది. ఆందోళన చేస్తున్న యువతికి మహిళా సంఘాల నాయకురాలు మద్దతుగా నిలిచారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి యువతిని సీఐ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా బాధిత యువతి అనూష మాట్లాడుతూ.. సోమగూడెంకు చెందిన సింగరేణి కార్మికుడు షేక్ సలీం ఇద్దరం 8 ఏళ్లుగా ప్రేమించుకున్నామని, అన్ని రకాలుగా వాడుకొని, నన్ను అందరి మధ్య తప్పుగా చిత్రీకరించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆరోపించారు.
ఈ విషయంపై కేసు కూడా పెట్టగా 45 రోజుల జైలు శిక్ష పడినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. 29న మరో అమ్మాయితో పెళ్లి ఖాయం చేసుకోవడంతో ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. తనకు సలీంతో పెళ్లి చేసి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించనని స్పష్టం చేశారు. సదురు యువకుడి కుటుంబ సభ్యులు కూడా గొడవ చేశారు. కావాలనే ఇబ్బంది పెడుతున్నారని, మా కుటుంబాన్ని మొత్తం నాసినం చేశారని, మా కుటుంబం చస్తామని వాగ్వివాదం చేశారు.
దింతో యువకుడి కుటుంబ సభ్యులను పోలీసులు మందమర్రి సీఐ కార్యాలయానికి తరలించారు. అనంతరం కాసిపేట ఇంచార్జ్ ఎస్ఐ బూర రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు యువతికి నచ్చ చెప్పి యువతిని కూడా మందమర్రి సీఐ కార్యాలయానికి తరలించారు. ఆందోళన చేస్తున్న యువతికి అంబేద్కర్ సంఘం మహిళా నాయకురాలు మద్దెల భవాని, కామెర అనూష, తదితరులు మద్దతుగా నిలిచారు.